రైతు సంఘాలకు విశేష అధికారాలు

రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విషయంలో రైతు సంఘాలకు విశేష అధికారాలు ఉంటాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వచ్చిన నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతులు కనీస మద్దతు ధర కంటే కొంచెం ఎక్కువగా వచ్చినప్పుడే సరుకును మార్కెట్లో అమ్ముకోవాలని, లేనట్లయితే  రైతు సంఘాలకే పర్మిట్లు ఇచ్చి ప్రాసెసింగ్ (మిల్లింగ్) చేసే హక్కు కల్పిస్తామని చెప్పారు.   బడ్జెట్ లోనూ రూ.500 కోట్ల మూలనిధిని కేటాయించి రాష్ట్ర రైతు సమాఖ్య ఖాతాలో వేస్తామన్నారు. ఈ మూలనిధికి తోడు బ్యాంకుల నుండి కూడా మరికొంత రుణం తీసుకుని రాష్ట్ర రైతు సమాఖ్యను ఆర్థిక శక్తిగా మారుస్తామన్నారు.  రైతులకు మంచి ధర ఇచ్చే విషయంలో,  రైతులు తమ సరుకును ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి రాష్ట్ర రైతు సమాఖ్య దోహదపడుతుందన్నారు.

రైతుకు మేలు చేసేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారని చెప్పారు.  భూములు, రైతుల వివరాలను నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత గ్రామ రైతులందరి భాగస్వామ్యంతో గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. తరువాత మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయానికి సంబంధించి ప్రతీ దశలోను రైతు సంఘాలు ఎక్కడికక్కడ చొరవ తీసుకుని రైతుకు మేలు చేసే  కార్యక్రమాలను సమన్వయం చేస్తాయన్నారు.  వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేసే విషయంలో, పరస్పర సమన్వయంతో రైతులు నిర్వహించుకునే వ్యవసాయ విధానాల్లో రైతు సంఘాలు సహాయకారిగా వుంటాయన్నారు. రైతుకు ఎకరానికి రెండు పంటలకు గాను రూ.8 వేల పెట్టుబడి కల్పించడం వల్ల అప్పుల ఊబిలోకి వెళ్లే ప్రమాదం తప్పుతుందని సిఎం కేసీఆర్ అన్నారు.

సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని సిఎం కేసీఆర్ చెప్పారు.   వచ్చే ఏడాదికే కాళేశ్వరం పంప్ హౌజ్ ల నుండి గోదావరి నీటిని తీసుకుంటామన్నారు.    ఎంఎండి, ఎల్ఎండి ల ద్వారా వరంగల్ జిల్లాకు నీరు చేరుకుంటుందని తెలిపారు.   మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా వరకు ఉన్న ఎస్ఆర్ఎస్పి కాలువలన్నీ మరమ్మత్తు చేసుకోవాలని సూచించారు. ఎల్ఎండి దిగువన కూడా 8 నుండి 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నీటి ప్రవాహం ఉండేందుకు అనువుగా ఎస్ఆర్ఎస్పి కాలువలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎస్ఆర్ఎస్పి కాలువలను పరిశీలిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించడానికి సిద్ధంగా వుందని, రైతులు, ప్రజాప్రతినిధులు కాలువల మరమ్మత్తుల విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. కాలువల వెంట నిరంతరం నీటి ప్రవాహం వుంటుందని, చెరువులు ఎప్పటికప్పుడు నింపుకుని రెండు పంటలు పండించుకోవాలని సిఎం ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన వారిలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్, ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే కవిత, సీనియర్ నాయకులు రామ సహాయం రంగారెడ్డి, ఒడిసిఎమ్ఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, ఎంపిపిలు, జడ్పిటిసిలు, రైతు నాయకులు వున్నారు.