రైతుల కళ్లల్లో ఆనందమే సీఎం కేసీఆర్ లక్ష్యం

రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 18 నెలల్లోనే పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్‌ 1, స్టేజ్‌ 2 కాలువలను పరిశీలించారు. అధికారులతో కలిసి కాలువ పొడవునా కలియ తిరిగారు.

మొదట హసన్‌పర్తి మండలం పలివెల్పులలో ఎస్‌ఆర్ఎస్‌పీ కాలువను మంత్రి హరీశ్ పరిశీలించారు. తర్వాత ఆటోనగర్‌లో నిర్వాసితులతో మాట్లాడారు. భూములు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారు. గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించే మహాయజ్ఞం కొనసాగుతుందన్నారు.

వచ్చే ఏడాది జూన్‌ కల్లా కాళేశ్వరం నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువల ద్వారా వరంగల్‌కు పూర్తిస్థాయిలో నీరందిస్తామన్నారు మంత్రి హరీశ్‌ రావు. ఈలోగా ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువల మరమ్మతు పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి పంట పండిందన్న మంత్రి హరీశ్‌.. ప్రభుత్వమే ఆరున్నర వేల కోట్ల ఖర్చుతో ధాన్యం సేకరించిందన్నారు.

పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేటలో మంత్రి హరీశ్ రావు విస్తృతంగా పర్యటించి ఎస్సారెస్పీ కాలువల స్థితిగతులను సమగ్రంగా పరిశీలించారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ పద్మ, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, వరంగల్ మేయర్ నరేందర్ ఉన్నారు.

ఎస్సారెస్పీ ప్రధాన కాలువ ద్వారా 7 వేల క్యూసెక్కుల నీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ వెల్లడించారు. తొలిసారి పాలిథిన్ కవర్‌ను కాలువపై కప్పి నీరు వృథా కాకుండా ప్రయోగం చేయనున్నామని తెలిపారు. అటు ఎస్సారెస్పీ 1, 2వ దశ కాలువలకు అవసరమైన రిపేర్లు, అప్‌గ్రేడ్‌లకు వెంటనే అనుమతిలిస్తామని చెప్పారు. వర్ధన్నపేట మండలంలో ఆకేరువాగు వద్ద రూ. 8 కోట్లతో మిషన్ కాకతీయ-4 కింద చెక్‌డ్యాం నిర్మిస్తామని ప్రకటించారు.

అనంతరం మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. డోర్నకల్‌ నియోజకవర్గంలోని నర్సింహులు పేట, మరిపెడలోని ఎస్సారెస్పీ కాలువలను పరిశీలించారు. తర్వాత మరిపెడలో మినీ ట్యాంక్‌ బండ్ పైలాన్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంక్షేమ రంగంలో తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న విపక్షాలపై మంత్రి హరీశ్ ఫైరయ్యారు. ఇకనైనా అనవసర ఆరోపణలు మానుకొని బంగారు తెలంగాణ సాధనలో కలిసి రావాలని సూచించారు.