రేపు సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ-3 ప్రయోగం

భారీ అంతరిక్ష వాహకనౌక జీఎస్‌ఎల్‌వీ-ఎంకే 3 ప్రయోగానికి ఇస్రో  ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం సాయంత్రం 5.28 గంటలకు నెల్లూరులోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. ఈ మేరకు ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 3.58 నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం కానున్నది. 3,136కిలోల బరువున్న కమ్యూనికేషన్ శాటిలైట్‌ను జీఎస్‌ఎల్‌వీ-ఎంకే 3 భూ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎంకే 3 కోసం ఇస్రో 17 ఏండ్లుగా కసరత్తు చేస్తున్నది. దీని కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించింది. ఈ రాకెట్‌లో వినూత్న నావిగేషన్, గైడెన్స్, నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ రాకెట్ గమనాన్ని, పనితీరును ఎస్‌బాండ్ టెలిమెట్రీ, సీబ్రాండ్ ట్రాన్స్‌పాండర్లు నిశితంగా పరిశీలిస్తాయి. జీఎస్‌ఎల్‌వీ-ఎంకే 3 ద్వారా భవిష్యత్‌లో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు కూడా నిర్వహించాలని ఇస్రో భావిస్తున్నది.