గ్రూప్-1, 2 ఫలితాలు విడుదల

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు విడుదల చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు. ఉద్యోగార్థులకు ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలు రేపటి నుంచి టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు. వారం రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభిస్తామన్నారు. మొదట గ్రూప్-1 అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫై చేస్తామని, ఆ తర్వాత గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి, సభ్యులతో కలిసి ఆయన సంస్థ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.

128 గ్రూప్-1 పోస్టులు, 1032 గ్రూప్-2 పోస్టులకు పరీక్షలు నిర్వహించినట్టు చక్రపాణి చెప్పారు. గ్రూప్-1 లో ఒక్కో పోస్టుకు ఇద్దరి చొప్పున,  గ్రూప్-2లో ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు పిలుస్తామని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే పైరవీకారులు, దళారులను నమ్మవద్దని చక్రపాణి సూచించారు. అవసరమైన సర్టిఫికెట్లు అన్ని సిద్ధం చేసుకోవాలని, ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

మూడు రోజుల కిందట నిర్వహించిన గురుకుల పాఠశాలల పీజీటీ, టీజీటీ, పీడీ పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ కీ రెండు రోజుల్లో ఇస్తామని చక్రపాణి చెప్పారు. ఈ నెల 29,30 తేదీల్లో పీజీటీ మెయిన్ పరీక్ష, వచ్చే నెల (జులై) రెండో వారం లోపు టీజీటీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేస్తామన్నారు. గురుకులాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పరీక్షలు వచ్చే నెలలో నిర్వహిస్తామని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం తమకు అప్పగించిన ఉద్యోగ నియామకాల పరీక్షలు అన్నిటిని పూర్తి చేశామని చక్రపాణి చెప్పారు. ఇప్పటి వరకు 15 వేల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించామన్నారు. డీఎస్సీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ప్రభుత్వం నుంచి ఇంకా తమకు అందలేదని వెల్లడించారు. కొత్తగా మరో 2,437 పోస్టులకు 15 నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు చక్రపాణి వెల్లడించారు. వీటిని రేపు విడుదల చేస్తామన్నారు. వీటిలో రెసిడెన్షియల్ కాలేజీలు, యూనివర్సిటీల్లో వివిధ స్థాయిల పోస్టులు ఉన్నాయని తెలిపారు.