రేపటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల12 నుంచి 26 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు రాష్ట్రంలో 21 సహాయకేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయకేంద్రాలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. మొదటి రోజు ఒకటి నుంచి 6 వేల ర్యాంకుల వరకు కౌన్సెలింగ్‌ ఉంటుంది. 13వ తేదీన 6001 ర్యాంకు నుంచి 16వేల వరకు, 14వ తేదీన 16001 నుంచి 26వేల వరకు, 15వ తేదీన 26001 నుంచి 36వేల వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరగనుంది. ఈ నెల 21న చివరి ర్యాంక్ వరకు కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలి. అలాగే ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌ టికెట్, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, పదో తరగతి మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16 నుంచి 22 వ‌ర‌కు ఆభ్య‌ర్ధులు ఆప్షన్లు ఎంచుకోవాలని ఆధికారులు సూచించారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఆప్ష‌న్లు మార్చ‌కోవ‌చ్చు. ఈ నెల 28న విద్యార్ధుల‌కు సీట్లు కేటాయించ‌నున్నారు. వచ్చే నెల మూడో తేదీ లోగా విద్యార్ధులు తమకు సీటు వచ్చిన కాలేజీల్లో చేరాల‌ని అధికారులు సూచించారు.

మరోవైపు, జేఎన్‌టీయూ హైదరాబాద్ అనుబంధ కాలేజీల జాబితాను ఉన్నత విద్యామండలి రేపు ప్రకటించనుంది. వసతులు సరిగా లేని కాలేజీల్లో సీట్లను తగ్గించే అవకాశం ఉంది.