రెండో సెమీస్ కు భారత్ సిద్ధం

ఛాంపియన్స్‌ ట్రోఫీ రెండో సెమీఫైనల్‌కు భారత్‌, బంగ్లాదేశ్‌ సిద్ధమయ్యాయి. ఎడ్జ్‌ బాస్టన్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో నెగ్గి ఫైనల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో దుమ్మురేపుతున్న భారత్‌.. రెండో సెమీస్‌ లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నది. అయితే, బంగ్లా జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. మరోవైపు అదృష్టం కలిసొచ్చి సెమీస్‌ స్టేజ్‌ కు చేరిన బంగ్లాదేశ్‌.. సంచలన విజయంపై ఫోకస్‌ పెట్టింది.

లీగ్‌ స్టేజ్‌ లో ఆడిన మూడు మ్యాచ్‌ ల్లో మెన్‌ ఇన్‌ బ్లూ రెండింటిలో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో  పాకిస్థాన్‌పై సూపర్‌ విక్టరీ సాధించిన కోహ్లీ సేన.. రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్య పరాజయం పొందింది. అయితే, డూ ఆర్‌ డై మ్యాచ్‌లో ఆల్‌ రౌండ్‌ షోతో సౌతాఫ్రికాను చిత్తుచేసి సెమీస్‌ చేరింది. ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌ లో పటిష్టంగా ఉన్న కోహ్లీ సేననే ఫేవరేట్‌గా అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే మునుపెన్నడూ లేని విధంగా బ్యాటింగ్‌ డిపార్ట్‌ మెంట్‌ సూపర్‌ ఫామ్‌ లో ఉంది. టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ పరుగుల వరద పారిస్తున్నది.

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ చక్కని టచ్‌లో ఉన్నారు. లీగ్‌ మ్యాచ్‌ ల్లో అదరగొట్టారు. చక్కని శుభారంభాలు అందించారు. ముఖ్యంగా శిఖర్‌ ధావన్‌.. గత ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫామ్‌ ను కొనసాగిస్తూ ఇప్పటికే రెండు హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీతో భీకర ఫామ్‌ లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్‌తో రోహిత్‌ తో కలిసి ధావన్‌ విజృంభిస్తే భారత్‌కు తిరుగుండదు. ఆ తర్వాత వచ్చే విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, ధోనీ, హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్‌ రాణిస్తే బ్యాటింగ్‌ హిట్టయినట్టే. భారత్‌ బౌలింగ్‌ కూడా వికెట్ల పంట పండిస్తున్నది. ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా.. ఇద్దరు పేసర్లు  ఉమేష్‌, భువనేశ్వర్‌ రూపంలో మరోసారి నలుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లతోనే బరిలోకి దిగబోతోంది.

లీగ్‌ స్టేజ్‌ లో ఒకే ఒక విజయంతో లక్కీ కొద్ది సెమీస్‌ చేరిన బంగ్లాదేశ్‌ ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. న్యూజిలాండ్‌పై భారీ టార్గెట్‌ చేధించి తమ ఫైటింగ్‌ స్పిరిట్‌ ప్రదర్శించారు. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ లపై పరుగుల వరద పారించిన బంగ్లా బ్యాటింగ్‌ మరోసారి సక్సెస్‌ అయితే కోహ్లీ సేనకు కష్టాలు తప్పవు. తలా ఓ సెంచరీ బాదిన తమీమ్‌ ఇక్బాల్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, మహముదుల్లా.. భారత బౌలర్లకు సవాల్‌ విసురుతున్నారు.  సౌమ్య సర్కార్‌, ముషిఫికర్‌ రహీం కూడా చక్కని స్కోర్లు సాధిస్తున్నారు. ఇక మోర్తాజా లీడ్‌ చేస్తున్న బౌలింగ్‌ కూడా భారత్‌ ను కట్టడి చేసే స్థాయిలోనే ఉంది.

గత ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు తలపడగా అపుడు భారత్‌ గెలిచింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ అదే రిపీట్‌ చేసి ఫైనల్లో ఎంట్రీ ఇవ్వాలని కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది. ఒత్తిడిని అధిగమించి కోహ్లీ సేన ఫైనల్‌ చేరుతుందా లేక బంగ్లా చరిత్ర సృష్టిస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.