రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ కౌంటర్

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంగారెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో తయారీ రంగం, అవినీతి, కుటుంబ పాలన అంటూ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. స్కామ్ గ్రెస్ నాయకులు అవినీతి గురించి మాట్లాడటం మిలీనియం జోక్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఐదు మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయని, రాహుల్ గాంధీకి మేడిన్ తెలంగాణ ఫోన్ కావాలంటే తీసుకోవచ్చన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

ఇప్పటికే ఏ విలువ లేనటువంటి స్థానిక నాయకులు ముందుగానే రాసిచ్చిన ప్రసంగం చదివిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీని మరింత చులకన చేశారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా కుటుంబ పాలన గురించి మాట్లాడటం మిలీనియం జోక్ అని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులు తమ సొంత ప్రాంతంలోనే గెలవలేరు కానీ.. పెద్దపెద్ద మాటలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ఈ నేతలు కాదా దేశంలో ఎమర్జెన్సీ విధించిందని విమర్శించారు.