రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు  

రాష్ట్రంలో నైరుతి పవనాల ప్రభావం స్పష్టంగా కనిస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్  నుంచి  కోస్తాంధ్ర, రాయలసీమ  మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి  కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి.

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్‌, మెహిదీపట్నం, కోఠి, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, సికింద్రాబాద్‌, బేగంపేట్‌, తార్నాక, పాతబస్తీ, పురాణాపూల్‌, ట్యాంక్‌బండ్‌, నారాయణగూడ, ఆర్టీసీక్రాస్‌రోడ్‌ లో వర్షం పడింది.
అటు రంగారెడ్డి, వికారాబాద్,  మేడ్చల్  జిల్లాల్లో  కుంభవృష్టి కురిసింది.  తాండూరు, పరిగి, చేవెళ్లలో భారీ వర్షం పడింది. వర్షాలతో షాబాద్‌ మండలం నాగర్‌గూడ దగ్గర ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బషీరాబాద్‌ నుంచి తాండూరు మధ్య గోటిగాకుర్దుకు పెద్ద ఎత్తున వరద ఉదృతి కొనసాగుతున్నది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి నాలాలు పొంగి పొర్లాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

అటు చౌదరిగూడెం మండలం పరిధిలోని తుమ్మలపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలతో కొందుర్గు మండలంలోని నవాబ్ పేట రోడ్డు తెగిపోయింది. దీంతో ఈ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి.  తoగలపల్లి, చెక్కలోనిగూడెం, గoగనగుండె, చెరుకుపల్లి వాసులకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. వేములవాడ, కోనరావ్‌పేట్‌, చందుర్తి మండలంలో వర్షం పడింది. హుజూరాబాద్‌, కమలాపూర్‌, సైదాపూర్‌, శంకరపట్నంలో మోస్తరు వాన కురిసింది.

అటు నల్లగొండ జిల్లాలోని 22 మండలాల్లో వర్షం పడింది. సగటున 20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కేతెపల్లి మండలంలో 94 మి.మీ. వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలోని 17 మండలాల్లో వానలు కురిశాయి. సగటున 15 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జాజిరెడ్డిగూడెం మండలంలో 83 మి.మీ. వాన పడింది. మెదక్, సంగారెడ్డిలోనూ పలు చోట్ల వర్షాలు నమోదయ్యాయి. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వాన పడింది.