రాష్ట్రవ్యాప్తంగా ముసురేసిన రుతుపవనం

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, కొత్తగూడెం, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, నల్లగొండ జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలో జనజీవనం స్తంభించింది. అటు భారీ వర్షాలతో విత్తనాలు విత్తే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జనగామ పట్టణంలో జయశంకర్‌నగర్, రాజీవ్‌కాలనీ, బెత్లాపురంలోని పలు ఇండ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 19.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ మండలం బంగారుగూడ, జైనథ్ మండలం నిరాల, తర్ణం వాగు, తాంసి, తలమడుగు, బేల, బోథ్ నియోజకవర్గం ఉట్నూర్‌లో వాగులు పొంగిపొర్లాయి. మహబూబ్‌నగర్‌తో పాటు జిల్లాలోని నారాయణపేట, మక్తల్, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్‌లో మోస్తరు వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని మన్ననూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లో వర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలోని కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్టులకు స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్‌లోని రెడ్డి ఫంక్షన్ హాలులో పిడుగు పడడంతో భారీగా నష్టం వాటిల్లింది.

అటు మంచిర్యాలలో వరద నీటిలో రెండు కార్లు కొట్టుకుపోయాయి. జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్ కాలనీకి చెందిన బాలుడు సాయిచరణ్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పిల్లర్ల కోసం తీసిన గుంతలో పడి మృతి చెందాడు. బాసర శివారులో పిడుగు పడడంతో బిద్రెల్లికి చెందిన ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. నిర్మల్‌లో వరద నీరు చేరిన కాలనీలు, లోతట్టు ప్రాంతాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో అత్యధికంగా 65.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో గంట పాటు భారీ వర్షం కురిసింది. వరంగల్‌రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం సడీతండాలో లలిత, సాయికృష్ణ వ్యవసాయ బావి వద్ద పనులు చేస్తుండగా పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ మండలంలో దాదాపుగా గంటకు పైగా భారీ వర్షం కురవడంతో సిర్పూర్ వాగు ఉప్పొంగింది. కెరమెరిలో పెద్దవాగు, మెట్టపిప్రీ వాగులు ఉప్పొంగాయి.

కడెం ప్రాజెక్టులోకి 1166 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 683.450 అడుగులకు చేరింది. పూర్తి నిల్వ సామర్థ్యం 7.63 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.038 టీఎంసీల నీరు నిల్వ ఉంది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తి మట్టం 1183 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1165 అడుగులకు చేరింది. గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.