రాష్ట్రవ్యాప్తంగా ధూంధాంగా గొర్రెల పంపిణీ

రాష్ట్రంలో ఎక్కడికక్కడ గొర్రెల పంపిణీ పథకం అట్టహాసంగా జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు.. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఊరూరా గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లు అందజేశారు. గొర్రెలను పెంచి పోషించి, సంపద సృష్టించాలని పిలుపునిచ్చారు.

కామారెడ్డి జిల్లాలో గొర్రెల పంపిణీ పథకానికి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌లో లబ్దిదారులకు ఆయన గొర్రెలను పంపిణీ చేశారు. గొర్రెల పెంపకానికి సంబంధించి రైతులతో మాట్లాడారు. వారికి పలు సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. అటు నిజామాబాద్‌ జిల్లా దోన్కల్‌ లో గొల్ల కుర్మలకు ఎంపీ కవిత గొర్రెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని శ్రీకారం చుట్టారు. దేవరకద్ర, మక్తల్, మరికల్, నారాయణ పేట, జమిస్తాన్ పూర్ లో లబ్దిదారులకు స్వయంగా గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. గొర్రెల ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు. మూడేళ్లు తిరిగే సరికి గొల్ల కురుమలు 25 వేల కోట్ల సంపద సృష్టిస్తారని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ పాల్గొన్నారు.

ఇటు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచెడ్ లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. రాష్ట్రంలో 84 లక్షల మందికి 4 వేల కోట్ల రూపాయలతో గొర్రెలు పంపిణీ చేశామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.

గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జోగురామన్న చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో గొర్రెల పంపిణీ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులకు గొర్రెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్ పాల్గొన్నారు. అటు నిర్మల్‌ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పలువురు లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఖానాపూర్ మండలం దిలావర్ పూర్ లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రారంభించారు. లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు.

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. వట్ పల్లి మండల కేంద్రంలో గొర్రెల పంపిణీ పథకానికి ఎమ్మెల్యే బాబూమోహన్ శ్రీకారం చుట్టారు. అటు వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటంపల్లిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, కలెక్టర్‌ శ్వేతా మహంతి లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు.

మంచిర్యాల జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ లాంఛనంగా ప్రారంభించారు. హాజీపూర్‌ మండలం గుడిపేటలో ఎమ్మెల్యే దివాకర్‌ రావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కుమార్‌ లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ జీడిచేనులో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. స్థానిక గొల్ల కురుమలకు ఎనిమిది యూనిట్ల గొర్రెలను, వాటి ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు.

కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లి గ్రామంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ప్రారంభించారు. గొల్ల కురుమలకు గొర్రెలను అందజేశారు. అటు భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో లబ్దిదారులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గొర్రెల యూనిట్లను పంపిణీచేశారు. నిజామాబాద్‌ జిల్లా కంఠేశ్వర్‌లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త ప్రారంభించారు. లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ లబ్దిదారులకు గొర్రెలు అందజేశారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో గొర్రెల పంపిణీ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. ధరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామంలో లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైనీ గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. 12 మందికి 12 యూనిట్ల గొర్రెలకు సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలను కూడా అందించారు.