రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు!

రాష్ట్రవ్యాప్తంగా రేపు, ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, జార్ఖండ్  నుంచి తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీవర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు. గత నెల 30న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాల గమనం కాస్త మందగించడంతో వర్షాలు కొంత ఆలస్యం అవుతున్నాయని వివరించారు. క్రమంగా కర్ణాటక, రాయలసీమ జిల్లాలకు విస్తరిస్తున్న రుతుపవనాలు మరో రెండు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఉపరితల ఆవర్తనం రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు దోహదపడుతుందని వివరించారు.

అటు నిన్న రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. భువనగిరిలో 4 సెం.మీ, శంషాబాద్‌లో 4 సెం.మీ చొప్పున, చేవెళ్ల, మహేశ్వరం, కొందుర్గు, వికారాబాద్‌ల్లో 3 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.  హైదరాబాద్‌లో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. ఇటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాలలో భారీ వర్షం కురిసింది. షాబాద్‌లో ఉరుములు మెరుపులతో వాన దంచి కొట్టింది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో ఉరుములు మెరుపులతో వాన పడింది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌, సంగారెడ్డి జిల్లా ఆర్‌సీపురంలో వర్షం దంచి కొట్టింది.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నకిరేకల్‌లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. నల్లగొండ పట్టణంతోపాటు కేతెపల్లి, చండూరులో చిరుజల్లులు పడ్డాయి. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, తంగడపల్లిలోనూ భారీ వర్షం కురిసింది. భువనగరి, బీబీనగర్‌, పోచంపల్లి, మోత్కూరు మండలాల్లో మోస్తరు వాన పడింది.  సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈదురు గాలులతో వర్షం పడింది. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, నవాబ్‌పేట్‌, హన్వాడ, దేవరకద్రలో మోస్తరు వర్షం కురిసింది.

ఖమ్మం జిల్లా వైరా, కారేపల్లిలో భారీ వర్షం కురిసింది. ఖమ్మం పట్టణంలో కుండపోత వాన కురిసింది. మధిరలో ఈదురుగాలుల వర్షానికి జనం వణికిపోయారు. ఖమ్మం రూరల్‌, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో భారీ వర్షం పడింది.

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని పలుగ్రామాల్లో భారీ వర్షం పడింది. అటు కరీంనగర్‌ పట్టణంతోపాటు తిమ్మాపూర్‌ మండలంలో మోస్తరు వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు ధర్మపురి, బుగ్గారం మండలాల్లోనూ భారీ వర్షం పడింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో ఉరుములు మెరుపులతో వాన ఈడ్చి కొట్టింది. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌  మండలంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కాగజ్‌నగర్‌లో మోస్తరు వాన పడింది.