రాష్ట్రంలో జోరుగా వానలు

నైరుతి రాకముందే రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఒక మోస్త్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జార్ఖండ్ నుంచి తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని చెప్పారు. కేరళ తీరాన్ని తాకిన తర్వాత కాస్త నెమ్మదించినా.. మళ్లీ వేగం పుంజుకున్నాయన్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాలను తాకిన నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా విస్తరిస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 5 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుదల నమోదైనట్టు ఆయన వెల్లడించారు. ఇవన్నీ రుతుపవనాల రాకకు సానుకూల అంశాలని చెప్పారు.

జార్ఖండ్ నుంచి తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఫలితంగా నిన్న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సారంగాపూర్, దిలావర్‌పూర్ మండలాల్లో  భారీ వర్షం కురిసింది. కడెం, ఖానాపూర్, మామడ మండలాల్లో భారీ ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. నిజామాబాద్ జిల్లాలో   31.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ధర్పల్లి మండలంలో 72.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా బోధన్‌లో 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

అటు  మహబూబాబాద్ జిల్లా  బయ్యారంలో భారీ వర్షం కురిసింది. ఇక ఖమ్మం లో   భారీ వర్షం పడింది. నల్లగొండ, యాదగిరిగుట్ట, వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే మార్గంలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడి రాకపోకలకు అంతరాయం కలిగింది. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.