రామ్‌నాథ్ ఎంపికపై పలు పార్టీల హర్షం  

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ఖరారయ్యారు. బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ను తమ అభ్యర్ధిగా ప్రకటించారు బీజేపీ చీఫ్ అమిత్ షా.  దళితుడైన రామ్ నాథ్ అభ్యర్ధిత్వంపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు సమాచారమిచ్చినట్లు చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే   ఉపరాష్ట్రపతి అభ్యర్ధిపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగలేదన్నారు అమిత్ షా.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించడంపై విపక్షాలు ఆచుతూచి స్పందించాయి. నిన్నటి దాకా రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరిన బీజేపీ….తమ దగ్గర రామ్ నాథ్ పేరును ప్రస్తావించలేదన్నారు కాంగ్రెస్ నేత ఆజాద్. అయితే ఆయనకు మద్దతివ్వడంపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ నెల 22 న విపక్షాలన్నీ మరోసారి సమావేశమవుతాయని, అందులో రాష్ట్రపతి అభ్యర్ధిపై చర్చిస్తామన్నారు. రామ్ నాథ్ కోవింద్ అభ్యర్ధిత్వంపై  ఇప్పుడే ఎలాంటి కామెంట్స్ చేయబోనన్నారు.

ఇక వామపక్షాలు కూడా రామ్ నాథ్ అభ్యర్ధిత్వంపై ఇప్పుడే స్పందించబోమని తెలిపాయి. 22న జరిగే విపక్షాల సమావేశం తర్వాత తమ స్పందన తెలియజేస్తామన్నారు సీపీఎం నేత సీతారాం ఏచూరీ.  ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ….ఎన్డీయే ఛాయిస్ ను వ్యతిరేకించారు. రామ్ నాథ్ ను ఏ ప్రాతిపదికన రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేశారని ప్రశ్నించారు. దేశంలో ఆయన కంటే గొప్ప దళిత నాయకులు ఉన్నాయని, కేవలం బీజేపీ దళిత మోర్చా నాయకుడనే కారణంతోనే రామ్ నాథ్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేశారన్నారు.

మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడం పట్ల వ్యక్తిగతంగా ఆనందంగా ఉందన్నారు నితీష్ కుమార్. అయితే విపక్షాల సమావేశం జరిగిన తర్వాతే తమ పార్టీ వైఖరి ప్రకటిస్తామన్నారు. అటు మాయావతి కూడా  దళితుడైన రామ్ నాథ్ ను బీజేపీ తమ అభ్యర్ధిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దళితుడనే ఒకే కారణంతో ఆయన్ను తాము వ్యతిరేకించడం లేదని, అయితే విపక్షాలు ఇంత కంటే ఉన్నతమైన వ్యక్తిని అభ్యర్ధిగా ప్రకటిస్తే…అప్పుడు ఆలోచిస్తామన్నారు. విపక్షాల అభ్యర్ధిపై త్వరలోనే సమావేశం జరుగుతుందన్నారు మాయావతి.

మరోవైపు రామ్ నాథ్ కు మద్దతుపై ఎన్డీయే మిత్రపక్షం శివసేన ఎటూ తేల్చలేదు. రామ్ నాథ్ ఎంపికపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేతో బీజేపీ చీఫ్ అమిత్ షా మాట్లాడారు. కానీ పార్టీ నేతలతో సమావేశం జరిపిన తర్వాత తమ నిర్ణయం తెలుపుతామని ఆ పార్టీ నేత సంజయ్ చెప్పారు.

ఇక రామ్ నాథ్ అభ్యర్ధిత్వానికి పూర్తి మద్దతు తెలిపింది టీఆర్ఎస్. స్వయంగా ప్రధాని మోడీ…సీఎం కేసీఆర్ కు ఫోన్  మద్దతు కోరారు.  ఇక అన్నాడీఎంకే కూడా రామ్ నాథ్ అభ్యర్ధిత్వానికి మద్దతు పలికింది. మరోవైపు వైసీపీ ఇప్పటికే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికే తమ మద్దతని ప్రకటించింది.