రాజ్ భవన్ హైస్కూల్ ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు ఇవాళ ఒక గొప్ప దినమని గవర్నర్ నరసింహన్ అన్నారు. రాజ్ భవన్ రోడ్ లో స్కూల్ కట్టాలి అని అడగగానే వెంటనే స్పందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రాజ్ భవన్ రోడ్ లో కొత్తగా నిర్మించిన గవర్నమెంట్ హైస్కూల్ ని గవర్నర్ నరసింహన్ దంపతులు, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ ప్రారంభించారు. ఆ తర్వాత చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

రాష్ట్రంలోనే రోల్ మెడల్ గా రాజ్ భవన్ గవర్నమెంట్ స్కూల్ గా తయారుచేస్తామని గవర్నర్ నరసింహన్ చెప్పారు. టీచర్స్ కూడా పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. తాము పక్కనే ఉంటామని, ప్రతిదీ చెక్ చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదని ప్రశంసించారు. నాణ్యమైన విద్య దిశగా పాఠశాలలు ఎదగాలని ఆకాంక్షించారు. టీచర్స్ అందరూ పిల్లలను ఒకే విధంగా చూడాలని, ఒకరు చదివేవారు, ఇంకొకరు చదవని వారు అనే విధంగా తయారుచేయకూడదని సూచించారు. మూడు నెలల తర్వాత మళ్ళీ తాను ఈ పాఠశాలను తనిఖీ చేస్తానని చెప్పారు.

గవర్నర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇలాంటి విద్యాభవన్ ను కట్టించినందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. 754 మంది విద్యార్థులు రాజ్ భవన్ హైస్కూల్ లో చదువుతున్నారని వెల్లడించారు. రాబోయే రోజులలో హైదరాబాద్ లోనే నంబర్ వన్ గవర్నమెంట్ హైస్కూల్ గా తీర్చిదిద్దే దిశలో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ప్రతి టీచర్ కమిటెడ్ గా పని చేయాలని, విద్యార్థులకు చక్కటి బోధన అందించాలని కడియం కోరారు.

విద్యాశాఖ పరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్ లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నామని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని వివరించారు. గవర్నర్ ఆశిస్తున్న విధంగా సలహాలు సూచనలు తీసుకొని ఈ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ, స్థానిక కార్పొరేటర్ విజయరెడ్డి. పూర్వ విద్యార్థులు, హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.