యూరప్ దేశాలపై భారీ సైబర్ దాడి

వాన్నాక్రై దాడి గురించి మరిచిపోకముందే యూరప్‌లో మరో భారీ సైబర్‌ దాడి వెలుగు చూసింది. ఈ దాడి ధాటికి.. బ్రిటన్‌, ఉక్రెయిన్‌, స్పెయిన్‌లోని పరిశ్రమలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు డౌన్‌ అవగా.. బ్యాంకులు, విద్యుత్‌ రంగ సంస్థలు ప్రభావితమయ్యాయి. దీన్ని అసాధారణ సైబర్‌ దాడిగా ఉక్రెయిన్‌ ప్రధాని వెల్లడించారు. మరోవైపు రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌, సెయింట్‌ గోబెన్‌, ఫ్రాన్స్ కు చెందిన ఓ నిర్మాణ సంస్థ, బ్రిటిష్‌ అడ్వర్జైటింగ్‌ సంస్థ డబ్ల్యూపీపీ తదితర కంపెనీలపై ఈ సైబర్‌ దాడిలో ప్రభావం అధికంగా పడినట్లు తెలుస్తోంది.‘వాన్నాక్రై’ తరహాలోనే ఇది మరో సైబర్‌ దాడిగా అభివర్ణించిన నిపుణులు ‘పెట్రా’ వైరస్‌గా దీన్ని భావిస్తున్నారు.

అమెరికా, భారత్‌లకు కూడా వైరస్ వ్యాపించింది. వాన్నాక్రై తరహాలోనే ఫైళ్లను లాక్‌చేసి డబ్బులు చెల్లిస్తేనే అన్‌లాక్ చేస్తానని వైరస్ హెచ్చరిస్తున్నది. దీనిని పెట్యా-డాట్-ఏ వైరస్‌గా గుర్తించారు. ఉక్రెయిన్, రష్యాల నుంచి ప్రారంభమైన ఈ వైరస్ దాడి వివిధ దేశాలకు శరవేగంగా విస్తరించింది.  ప్రభుత్వ, ప్రైవేటు నెట్‌వర్క్ తేడా లేకుండా వైరస్ దాడి చేస్తున్నది. ఫైళ్లను నిర్వీర్యం చేస్తున్నది. బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద యాడ్ కంపెనీ డబ్ల్యూపీపీ సర్వర్లపై వైరస్ దాడి జరిగింది. ఉక్రెయిన్‌లోని పలు రుణసంస్థలపై సైబర్‌దాడి జరిగినట్టు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ధృవీకరించింది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ఆర్థికసంస్థలకు హెచ్చరికలు జారీచేసింది.

సైబర్ దాడుల వల్ల బ్యాంకులు సరిగా పనిచేయలేకపోయాయి. ముఖ్యంగా ఉక్రెయిన్, బ్రిటన్, స్పెయిన్‌లలో అనేక సంస్థల కార్యకలాపాలు వైరస్ దాడివల్ల స్తంభించాయి. నార్వేలో ఓ భారీ కంపెనీ సర్వర్‌ పై సైబర్‌దాడి జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో ప్రముఖ సంస్థలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ విభాగాలు వైరస్ దాడితో అతలాకుతలమయ్యాయి. మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్టు యుక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అమెరికాలో మెర్క్ కంపెనీపై సైబర్ దాడి జరిగింది. సైబర్‌దాడిని ఎదుర్కోవడంపై స్వదేశీ, విదేశీ సంస్థలతో సమన్వయంతో కూడిన పరిశీలన జరుపుతున్నట్టు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఫ్రాన్స్‌లో సెయింట్ గొబేన్ కంపెనీ కంప్యూటర్లను వైరస్ స్తంభింపజేసింది. స్విస్, డేనిష్, జర్మన్ కంపెనీలు సైబర్‌దాడికి గురయ్యాయి.

రష్యాలోనూ సెంట్రల్ బ్యాంక్ ఆన్‌లైన్ వ్యవస్థ ప్రభావితమైంది. చెర్నోబిల్ వద్ద అణుధార్మికతను ఎప్పటికప్పుడు అంచనా వేసే కంప్యూటర్ వ్యవస్థ దెబ్బతిన్నది. భారత్‌లోనూ పలు సర్వర్లపై వైరస్ దాడి జరిగినట్లు సమాచారం. అయితే దీనిని భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఖండించింది. భారత్‌లో ఇప్పటివరకు వైరస్ దాడి జరిగినట్టు తమకు ఎలాంటి సమాచారం అందలేదని, పరిస్థితిపై అప్రమత్తంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు.