మౌలిక సదుపాయాల రంగానికి పెద్దపీట

దేశంలో మౌలిక సదుపాయాల రంగానికి పెద్ద పీట వేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేరళలో కోచి మెట్రో రైలు ప్రారంభించిన ప్రధాని..  మెట్రో రైలుకు కావాల్సిన పరికరాలు(సుమారు 70 శాతం) భారత్‌లోనే తయారయ్యాయని చెప్పారు. కొచ్చి మెట్రో రైలులో 1000 మంది మహిళలు, 23 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. కొచ్చి మెట్రో రైలు మేకిన్ ఇండియా దృష్టిని ప్రతిబింబిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.  దేశంలో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంపై తమ ప్రభుత్వం గత మూడేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైల్వేలు, రహదారులు, విద్యుత్ ను ప్రాధాన్యతా అంశాలుగా చేసుకున్నామని తెలిపారు. ప్రగతి సమావేశాల్లో 175 ప్రాజెక్టులపై తాను వ్యక్తిగతంగా చర్చించానని గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరించి పథకాల సగటు అమలును అభివృద్ధి చేశామన్నారు. రవాణా, డిజిటల్, గ్యాస్ గ్రిడ్ లు కలిగి ఉన్న తర్వాతి తరం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించామని చెప్పారు. నగరాల్లో ప్రజా రవాణాను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. మెట్రో రైలు ప్రారంభం అనంతరం ప్రధాని అదే రైలులో పలరిపట్టం నుంచి పాతదిప్పలానికి వరకు ప్రయాణించారు. తొలిదశగా 13 కిలోమీటర్ల పొడవై అలువా-పలరిపట మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే త్వరగా పూర్తైన మెట్రో ప్రాజెక్టుగా కొచ్చి మెట్రో రికార్డు నెలకొల్పింది.