మెడికల్ డివైజెస్ పార్క్‌తో మరింత గుర్తింపు

ఆవిర్భవించిన మూడేళ్లలోనే తెలంగాణ ఎన్నో అంశాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. ఆందోళనపథం నుంచి సుపరిపాలన పథంలోకి మళ్లిన తీరుపై తెలంగాణ ప్రశంసలు అందుకుందన్నారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ తెలంగాణలో నెలకొల్పడం శుభపరిణామమన్నారు. దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ మెడికల్ హబ్‌గా గుర్తింపు తెచ్చుకున్నదని చెప్పారు. మెడికల్ డివైజెస్ పార్క్‌తో హైదరాబాద్‌కు మరింత గుర్తింపు వస్తుందన్నారు.  తొలి దశలో 250 ఎకరాల్లో పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.  దేశంలో మొత్తం వ్యాక్సిన్ ఉత్పత్తిలో 35 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని గుర్తు చేశారు. వెయ్యికి పైగా కంపెనీలు ఉత్పత్తి కేంద్రాలను ఈ పార్క్‌లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రజలకు ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిష్ఫలం అనేది సీఎం కేసీఆర్ అభిప్రాయమన్నారు. వైద్య పరికరాలు స్థానికంగా లభిస్తే చికిత్స ఖర్చులు తగ్గుతాయన్నారు. ఈ పార్క్‌తో పాటు ఇతర కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా పెట్టుబడిదారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. దేశంలోని అన్ని ఆస్పత్రులు 75 శాతం పైగా వైద్య పరికరాలు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయని తెలిపారు. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటైతే ఆ సమస్య ఉండదన్నారు. చైనా మెడికల్ సిటీ, కొరియా మెడికల్ డివైజెస్ పార్క్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మంత్రి హరీష్‌రావు కృషి చేస్తున్నాయని కొనియాడారుసంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో  మెడికల్ డివైజెస్ పార్క్ కు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు పాల్గొన్నారు.