మూడవ విడత హరితహారానికి సర్వం సిద్ధం

మూడో విడత హరితహారానికి తెలంగాణ సిద్ధమవుతోంది. ఈ సారి రాష్ర్ట వ్యాప్తంగా నలభై కోట్ల మొక్కలు నాటే భారీ లక్ష్యంతో పనులను వేగవంతం చేస్తోంది అధికార యంత్రాంగం. అటవీ శాఖతో పాటు, గ్రామీణాభివృద్ది, ఉద్యానవన, హెచ్ ఎం డీ ఏ, జీ హెచ్ ఎం సీ  పరిధిలో మొత్తం 2 వేల 925 నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెంపకం జరుగుతోంది. సీఎం కేసీయార్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటి కప్పుడు నివేదికలను తెప్పించుకుంటూ, హరితహారం ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్ని జిల్లాల్లో హరితహారం పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తూ, నర్సరీ లను పరిశీలిస్తున్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 24 శాతంగా ఉన్న పచ్చదనాన్ని మరో తొమ్మిది శాతం పెంచి 33కు చేర్చటమే తెలంగాణకు హరితహారం లక్ష్యమని సీఎం కేసీయార్ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.

గడిచిన రెండు సంవత్సరాలు చేపట్టిన హరితహారం మంచి ఫలితాలను ఇస్తోందని అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి పి. కె. ఝా తెలిపారు. రెండు విడతల్లో నాటిన మొక్కలు ఎదుగుతూ పచ్చదనాన్ని పరుస్తున్నాయని, ఆ ఫలితాలే ఈయేడు హరితహారంలో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ఆదర్శమన్నారు. ఈ యేడు హరితహారం కోసం  జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రుతుపవనాల రాక సరైన సమయానికే అని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేయటంతో హరితవారం విజయవంతానికి ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. మండల స్థాయిలో ఏర్పాటైన కమిటీలు మొక్కలు నాటాల్సిన ప్రదేశాలను గుర్తించటంతో పాటు, ఎక్కడ ఏ రకం మొక్కల అవసరం ఉందో నిర్దేశిస్తున్నాయి. ఈ సారి హరితహారంలో పండ్ల మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతను ఇవ్వటంతో పాటు, వాటిని పెద్ద సంఖ్యలో సిద్ధం చేశారు. ..

ఇక చెరువులు, కుంట కట్టలపై తాటి, ఈత చెట్లను పెంచేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్సయిజ్ శాఖ అధికారులు, సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఆయా నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కల రకాలు, వాటి సంఖ్యతో పాటు, గుర్తించిన గ్రామాలు, ప్రదేశాల పట్టికను గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధి నుంచి అందరికీ అందుబాటులో ఉంచేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. టేకు మొక్కలు పదిహేను కోట్లు, ఈత మొక్కలు రెండున్నర కోట్లు ప్రస్తుతం సిద్ధం గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  క్షేత్ర స్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ  మొక్కలు నాటించడంలో పాటు సంరక్షణ చర్యలూ వెంటనే చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

ఇక ఈ సారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని స్థాయిల్లో రోడ్ల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.  జాతీయ, రాష్ర్ట రహదారులతో పాటు పంచాయతీ రాజ్ పరిధిలో ఉండే రోడ్ల వెంట కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. సరాసరి జిల్లాకు వంద కిలో మీటర్ల చొప్పున మొత్తం 31 జిల్లాల్లో మూడు వేల కిలో మీటర్లకు పైగా రోడ్ల వెంట మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటితో పాటు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న గుట్టలపైనా, వాలుల్లో చెట్లు పెంచేందుకు ఈ సారి వినూత్న ప్రయోగం చేస్తోంది ప్రభుత్వం. సీడ్ బాంబింగ్ పేరిట మట్టి, విత్తనాలు కలిపి తయారు చేసిన విత్తన బంతులను పెద్ద ఎత్తున గుట్టల ప్రాంతాల్లో చల్లాలని నిర్ణయించారు.  హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసి పరిధిలో రెండు కోట్లా పది లక్షల మొక్కలు నాటనున్నారు.  సిద్దిపేట, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండు కోట్ల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.