ముస్లిం మైనారిటీల విద్యావికాసానికి అధిక ప్రాధాన్యం

ముస్లిం మైనార్టీల విద్యా వికాసానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లిం మైనారిటీల కోసం రాష్ట్రంలో 204 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని అనీస్-ఉల్-గుర్భా కొత్త భవనం నిర్మాణానికి సీఎం కేసీఆర్  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అనీస్‌-ఉల్‌-గుర్భా నూతన భవనాన్ని గొప్పగా నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో 1921 సంవత్సరం నుంచి 60 మందికి ఆశ్రయం కల్పించే సామర్థ్యంతో అనీస్‌-ఉల్‌-గుర్భా నడుస్తున్నదని సీఎం చెప్పారు. ఇటీవల రోడ్డు వెడల్పులో అనీస్‌-ఉల్‌-గుర్భాకు చెందిన 191 గజాల స్థలం పోయిందని, దీనికి బదులుగా ప్రభుత్వం 4 వేల గజాల స్థలాన్ని కేటాయించడంతో పాటు నూతన భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసిందని సీఎం కేసీఆర్‌ వివరించారు.

ఏడు అంతస్తులతో 1.53 లక్షల చదరపు అడుగుల స్థలంలో నివాస యోగ్యంగా ఉండేటట్లు డిజైన్‌లు రూపొందించారు. మొదటి రెండు ఫ్లోర్లు వాణిజ్య సముదాయానికి, ఐదు ఫ్లోర్లు అనాథ పిల్లలకోసం కేటాయిస్తారు. 500 మంది బాలబాలికలకు వేర్వేరుగా వసతి కల్పించడంతో పాటు ఓ పాఠశాలను కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులు అనీస్‌-ఉల్‌-గుర్భాలో ఆశ్రయం పొందవచ్చు. జీవితంలో స్థిరపడే వరకు అనీస్‌-ఉల్‌-గుర్భాలో వసతి పొందవచ్చు అని సీఎం కేసీఆర్ చెప్పారు.

ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయం, విద్య అందించేందుకు నాంపల్లిలో రూ.20 కోట్ల ఖర్చుతో అనీస్-ఉల్-గుర్భా నిర్మాణం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్‌, బలాలా, పాషాఖాద్రి, మౌజంఖాన్‌, ఎమ్మెల్సీలు సలీమ్‌, ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఎంతో మందికి ఉపయోగపడే అనీస్‌-ఉల్‌-గుర్భా నిర్మాణానికి పూనుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.