ముస్లింలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాం

ముస్లింలకు తెలంగాణలో అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ముస్లింలకు రాజకీయ పదవుల్లో పెద్దపీట వేశామన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలను విద్య, అభివృద్ధిలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింల కోసం 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ స్కూళ్లలో కాన్వెంట్ తరహా విద్య అందిస్తామన్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. లక్షా 25 వేలు ఖర్చు చేస్తూ లక్షా 33 వేల మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నామని వివరించారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.20 లక్షల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి మైనారిటీ విద్యార్థులకు సివిల్స్ కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు.

అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఇస్లామిక్ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని, దీని కోసం త్వరలోనే భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముస్లింలు అందరికి రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎంపీ డీఎస్‌, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌, ముస్లిం మతపెద్దలు, పెద్దసంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు చేశారు.