మిడ్ మానేరు నిర్వాసితులకు చెల్లింపులు పూర్తి చేయండి

మిడ్ మానేరు ప్రాజెక్టు పరిధిలోని ఆర్ అండ్ ఆర్ పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 10 సంవత్సరాలలో జరగని పనులను కేవలం 12 నెలల్లో పూర్తి చేసినందుకు మిడ్ మానేరు ప్రాజెక్టు సిబ్బందిని, అధికారులను మంత్రి అభినందించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు పనుల పురోగతిని, భూ నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ కాలనీలలో తాగునీరు, రోడ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం తీసుకున్న చర్యలను మంత్రి హరీశ్ రావు ఇవాళ హైదరాబాద్ లో సమీక్షించారు.

మిడ్ మానేరు ప్రాజెక్టుని రికార్డు వ్యవధిలో పూర్తి చేసినా ఆర్ అండ్ ఆర్ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. మరో నెల రోజులే కీలకమని అన్నారు. వర్షాలు పెరిగితే నిర్వాసితుల పునరావాస ఏర్పాట్లు కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ దగ్గర భూ నిర్వాసితుల పరిహారం, పునరావాస చర్యలకు గాను రూ. 30 కోట్లు ఉంచామని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ పనులలో జాప్యం చేసినా, అలక్ష్యం చేసినా సహించేది లేదని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన నిర్వాసితుల పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.

మిడ్ మానేరు కింద ముంపునకు గురి కానున్న గ్రామాల్లో పరిస్థితిని మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. కొన్ని చోట్ల ప్రజలు ఇంకా ఖాళీ చేయలేదని అధికారులు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పనులను సమీక్షిస్తున్నారని అన్నారు. మిడ్ మానేరు పరిధిలో ముంపునకు గురయ్యే చింతల్ ఠాణా, కోదురుపాక, శాబాసుపల్లి, కొడి ముంజ, చీర్లవంచ, అనుపురం, ఆరెపల్లి, సంకేపల్లి, రుద్రవరం, వరదవెల్లి గ్రామాల నిర్వాసితులకు ఇప్పటివరకు జరిగిన పరిహారం చెల్లింపులను మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. ఇంకా పెండింగ్ లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఒక్క రోజు కూడా పెండింగులో ఉంచరాదని స్పష్టం చేశారు.

మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో 12 గ్రామాలకు చెందిన  నిరాశ్రయులైన కుటుంబాలకు పరిహారం చెల్లింపులు వెంటనే జరపాలని మంత్రి హరీశ్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషాను ఆదేశించారు. 13 ఆర్ అండ్ ఆర్ కాలనీలలోనూ కనీస సౌకర్యాలు యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని చెప్పారు. కొన్ని చోట్ల పెండింగ్ లో ఉన్న రోడ్లు నిర్మించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. నిర్వాసితుల ఇళ్ళకు  నిధులు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్ ఎం.డి.చిత్రా రామచంద్రన్ ను మంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, ఇ.ఎన్.సి.మురళీధరరావు, సి.ఈ లు అనిల్, హరిరామ్, ఓ.ఎస్.డి. దేశ్ పాండే పాల్గొన్నారు.