మిగులు విద్యుత్ దిశగా రాష్ట్రం అడుగులు

పరిపాలనలో అయినా సంస్కరణల్లో అయినా రాష్ట్ర ప్రభుత్వం  ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తోంది. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ..అన్ని వర్గాలకు చేరవైంది. ముఖ్యంగా విద్యుత్ విషయంలో తెలంగాణ అద్భుత విజయాన్ని సొంతం చేసుకొంది. పవర్ షార్టేజ్ సమస్య తీరిపోయింది. రాష్ట్రంలో మిగులు విద్యుత్ దిశగా అడుగులు పడుతున్నాయి. వ్యవసాయానికి ప్రస్తుతం 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోంది. వచ్చే ఖరీఫ్ నుంచి 24 గంటలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్వహించిన బహిరంగ విచారణ ఎలాంటి ఆందోళనలు, నిరసనలు లేకుండా ప్రశాంతంగా జరగడం..  ప్రభుత్వ సమర్థపాలనకు ప్రజల మద్దతుకు నిదర్శనంగా నిలిచింది.

ఉమ్మడిరాష్ట్రంలో విద్యుత్  చార్జీల పెంపుపై బహిరంగ విచారణ అంటే వేదిక సమీపంలో ధర్నాలు, లోపల రాజకీయ పార్టీల నిరసనతో దద్దరిల్లేది. కానీ స్వరాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి మారింది. విద్యుత్ వెలుగుల నేపథ్యంలో ఈ బహిరంగ విచారణ ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా ముగిసింది. సర్కార్  విద్యుత్  చార్జీలను పెంచకపోవడం, కోతల్లేని సరఫరా అందించడంతో..  బహిరంగ విచారణకు వామపక్షాలతోపాటు ఏ పార్టీ నేతలు హాజరుకాకపోవడం.. తెలంగాణ ప్రభుత్వ సమర్థపాలనకు నిదర్శనం. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్-టీఎస్‌ఎస్ పీడీసీఎల్) 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన ఆదాయ ఆవశ్యకత, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ ధరలపై  హైదరాబాద్ ఫ్యాప్సీ భవన్‌లో ఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించింది. సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు, రైల్వే ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) నిర్వహించిన విచారణకు హజరైనవారు.. పలు సూచనలు చేయడం  విశేషం.