మిక్స్‌డ్ డబుల్స్‌ ఫైనల్లోకి బోపన్న

ఫ్రెంచ్ ఓపెన్‌లో లియాండర్ పేస్, సానియా మీర్జా నిరాశపరిచినా రోహన్ బోపన్న ఫైనల్‌కు దూసుకెళ్లి టోర్నీలో భారత్‌ ఆశలను సజీవంగా ఉంచాడు. ఈ కర్ణాటక స్టార్ ఆటగాడు, కెనడా క్రీడాకారిణి గాబ్రియెలా డాబ్రోవిస్కీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్ చేరాడు. ఏడోసీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న-గాబ్రియెలా జోడీ సెమీఫైనల్లో 7-5, 6-3తో మూడోసీడ్ ఆండ్రియా లవకోవా (చెక్)-ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను ఓడించి టైటిల్‌పోరులో నిలిచింది. ఫైనల్లో అన్నా లీనా గ్రాన్‌ఫీల్డ్ (జర్మనీ) -రాబర్ట్ ఫరా (కొలంబియా) ద్వయంతో బోపన్న జోడీ తలపడనుంది. మరో సెమీస్‌లో అన్నా లీనా జంట 6-7(5), 6-3(10-5)తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీని ఓడించింది. 37ఏండ్ల బోపన్న గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 2010లో పాకిస్థాన్ ఆటగాడు ఖురేషీ జతగా బోపన్న యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో ఫైనల్ చేరాడు. బోపన్న ఫైనల్లో గెలిస్తే, గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలువనున్నాడు. ఇప్పటిదాకా భారత్ తరఫున లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచారు.