మామ్ సరికొత్త రికార్డ్!

మామ్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) తన సుదీర్ఘయానంలో వెయ్యి రోజులను పూర్తి చేసింది. మార్స్ కక్ష్యలో మామ్ సోమవారం వెయ్యోరోజు పరిభ్రమించింది. ఇది భూమి మీది రోజుల లెక్క. మార్స్ పగలు-రేయి లెక్కల ప్రకారమైతే ఇది 973.24 రోజులు అవుతుంది. మార్స్ చుట్టూ 388 ఆవర్తాలను మామ్ పూర్తి చేసింది అని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రణాళిక ప్రకారం ఈ ఉపగ్రహం జీవితకాలం 6 నెలలే. కానీ అంతకుమించి అది సేవలు అందిస్తుండడం విశేషం. ఇప్పటికీ అది బాగా పనిచేస్తున్నది. 2013లో శ్రీహరికోట నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా మామ్‌ను ప్రయోగించారు. తొమ్మిది నెలల ప్రయాణం తర్వాత అది మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆరు మాసాల సేవల అనంతరం 2015 మార్చిలో మరో ఆరు మాసాలపాటు మిషన్‌ను పొడిగించారు. మరెన్నో ఏండ్ల పాటు మిషన్‌ను కొనసాగించేందుకు సరిపడా ఇంధనం ఉపగ్రహంలో ఉందని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ప్రకటించారు.