లేడీ పైలట్లకు సెప్టెంబర్‌లో విధుల కేటాయింపు

భారత వైమానిక దళంలో చేరిన మొదటి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లు సెప్టెంబర్‌లో చివరి విడత శిక్షణ పూర్తయిన తర్వాత సుఖోయ్-30 జెట్ విమానాలను నడుపుతారని అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్‌లో భారత్ వాయుసేనలో మొట్టమొదటి ఫ్లయింగ్ ఆఫీసర్లుగా ఎంపికై రికార్డు సృష్టించిన భావనా కాంత్, మోహనా సింగ్, అవనీ చతుర్వేదీ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని కలైకుండ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బ్రిటిష్ హాక్ విమానాలతో శిక్షణ పొందుతున్నారు. మొదటిదశలో వారికి అధునాతనమైన ఎస్‌యూ-30 విమానాలు కేటాయించాలని భావిస్తున్నట్టు ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు చెప్పారు. 2015 అక్టోబర్‌లో ప్రభుత్వం ఫైటర్ పైలట్ల ఎంపికలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేసింది.