మహారాష్ట్రలో రైతుల సమ్మె ఉధృతం

మహారాష్ట్రలో రైతుల ఆందోళన తారా స్థాయికి చేరుకుంది. వరుసగా రెండో రోజు కూడా రైతులు రోడ్లపై ఆందోళనలు నిర్వహించారు. లారీల్లో తీసుకెళ్తున్న కూరగాయలను రోడ్లపై పారబోశారు. కొన్ని చోట్ల ప్రజలకు పాలను ఉచితంగా పంచారు. కూరగాయలు తీసుకెళ్తున్న వాహనాలను అడ్డగించి.. కూరగాయల సంచులను రోడ్లపై పారబోశారు రైతులు.

మహా రైతుల ఆందోళనలతో మార్కెట్లు వెలవెల బోతున్నాయి. ముంబై మహానగరంతో పాటూ పూణే, థానే, నాసిక్ వంటి పలు ప్రాంతాల్లో కూరగాయల కొరత కనిపిస్తోంది. ముంబైలో కూరగాయలు, పండ్ల మార్కెట్లలో సరుకులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు మార్కెట్లలో నిల్వ ఉన్న సరుకులను కూడా రైతులు నేలపాలు చేస్తున్నారు.  గురువారం నాడు నాసిక్ లో జరిగిన ఆందోళనలో ఎనమిది మంది పోలీసులు గాయపడటంతో…పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఇక రైతులకు మద్దతు తెలిపారు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే. అయితే మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసను ఆయన ఖండించారు. రైతులు శాంతియుతంగా తమ నిరసన చేపట్టాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించవద్దని కోరారు హజారే.

రైతు రుణమాణఫీ, రైతులకు ఉచిత కరెంట్, పంటలకు కనీస మద్దతు ధర, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల, 60 ఏళ్లు నిండిన రైతులకు పెన్షన్ ఇవ్వాలంటూ దాదాపు 50 లక్షల మందికి పైగా  రైతులు ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ ఆందోళనలు ఫడ్నవీస్ సర్కారు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.