మహారాష్ట్రలో రైతుల రుణమాఫీకి నిర్ణయం

మహారాష్ట్ర రైతుల పోరాటం ఫలించింది. 11 రోజుల ఆందోళన తర్వాత తాము అనుకున్నది సాధించారు. అన్నదాతల నిరసనలకు తలొగ్గిన ఫడ్నవీస్ సర్కార్‌.. ఎట్టకేలకు రైతుల రుణ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. రైతులు విధించిన డెడ్‌ లైన్‌ కు ఒకరోజు ముందే.. దాదాపు 30 వేల కోట్ల రూపాయల రైతు రుణాల్ని మాఫీ చేస్తున్నట్లు తెల్పింది. ఐతే, ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని షరతు కూడా విధించింది. రుణమాఫీ విధివిధానాలు ఖరారు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్న మహా ప్రభుత్వం.. తమ ఆదేశాలు చిన్న, మధ్య తరగతి రైతులకు వెంటనే వర్తిస్తాయని చెప్పింది.

ఫడ్నవీస్‌ ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముంబైలో పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. విడతల వారీగా కాకుండా ఒకేసారి రుణాలను మాఫీ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు రైతులు.

మహారాష్ట్రలో దాదాపు రెండున్నర కోట్ల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోటి ఏడు లక్షల రైతుల కుటుంబాలకు ఊరట లభించినట్లయ్యింది. చిన్న, మధ్య తరగతి రైతుల రుణాలు కలుపుకొని దాదాపు 30వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ కానున్నాయి.

పంటకు మద్దతు ధర, రుణమాఫీ చేయాలంటూ గత 11 రోజులుగా మహారాష్ట్ర రైతులు ఆందోళన చేస్తున్నారు. శిర్డీ, ఔరంగాబాద్‌, ధర్మాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఏకంగా సమ్మెకు దిగారు.  పాలు, కూరగాయల్ని రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు శివసేన సహా.. విపక్షాలు మద్దతు తెలిపాయి.

మధ్యప్రదేశ్ లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు జరిపిన  కాల్పుల్లో ఐదుగురు చనిపోవడం, పలువురు గాయపడటం, ఈ ఘటనపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. రేపు మహారాష్ట్ర బంద్ కు రైతులు పిలుపునివ్వడంతో పరిస్థితి చేయి దాటకముందే మేలుకోవాలని రుణమాఫీ నిర్ణయం ప్రకటించింది.