మత్స్యరంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ముఖ్యంగా ఎన్‌సీడీసీ రుణంతో జిల్లా మత్స్యకారుల సంఘాల బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. దీంతో పాటుగా నూతన కేంద్రాల నిర్మాణం, రిటైల్ చేపల మార్కెట్లు, హోల్‌సేల్ చేపల మార్కెట్ల నిర్మాణం చేపట్టనుంది. చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వేసేందుకు వందశాతం గ్రాంట్ ఇవ్వనుంది. సహకార సంఘాల సభ్యులకు చెరువులపై హక్కులు కల్పించనుంది.

అటు మత్స్య సంపద అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌కు, ఎన్సీడీసీ మంజూరు చేసిన వెయ్యికోట్ల రూపాయల రుణాన్ని ఖర్చు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిధులతో 2017-18, 2018-19 సంవత్సరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసారు. ఎన్‌సీడీసీ రుణంతో చేపట్టే కార్యక్రమాలతో 31 జిల్లాల్లోని 3.26 లక్షల మంది మత్స్య సహకార సంఘాల సభ్యులు లబ్ధి పొందనున్నారు. మొత్తం 38 రకాల అంశాల్లో ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.

చేప పిల్లల విత్తన అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేయడంతో పాటు.. కొత్త చేపల చెరువుల తవ్వకం చేపట్టనున్నారు. మొబైల్ పిష్ ఔట్‌లెట్ల ఏర్పాటు, పిష్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మత్స్యకారులకు పుట్టి తయారీకి సబ్సిడీని 75శాతానికి పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. వీటితో పాటు వలలు, తూకం వేసే వస్తువులు, మోపెడ్లు ఆటోలు, ట్రక్కులకు ప్రస్తుతం ఉన్న సబ్సిడీని 75 శాతానికి పెంచడం. నూతన పద్ధతుల్లో చేపల పెంపకం, చేప విత్తన కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే మత్స్యకార సంఘాల సభ్యులకు ప్రోత్సహించేందుకు 90 శాతం సబ్సిడీపై నిధులు కేటాయించనున్నారు.

చేపల పెంపకంలో మెళకువలు నేర్పేలా మత్స్యకార సంఘాల సభ్యులకు వివిధ శిక్షణ శిబిరాలు ఏర్పాటు కూడ చేయనున్నారు. మత్స్యరంగ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.