మంత్రి కేటీఆర్ ఖమ్మం టూర్ కు చురుగ్గా ఏర్పాట్లు

ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే ఖమ్మం నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికనూ రూపొందించింది. ఐటీ హబ్ నిర్మాణంతో పాటు వందల కోట్ల అభివృద్ధి పనులకు సర్కార్ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఖమ్మం నగరంలో రేపు (గురువారం) పర్యటించనున్నారు. కేటీఆర్ తో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మం నగరానికి మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. ఖమ్మంలో డీసీసీబీని ప్రారంభిస్తారు. అనంతరం రూ.350 కోట్ల ఖర్చుతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికంగా నూతన హంగులతో నిర్మిస్తున్న బస్టాండ్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం కళాకారులకు ఆలవాలంగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని పునర్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారాయన.

వీటితోపాటు ఖమ్మం మున్సిపాలిటీలో ఆటోమేటిక్ డంపింగ్ మెషిన్లు, ఎలక్ట్రానిక్ క్లీనింగ్ మెషీన్లు, చెత్త ట్రాలీలను ప్రారంభిస్తారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ పథకానికి 229 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తారు. ఖమ్మం జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన బన్ స్లా పురం రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు మంత్రి కేటీఆర్.

సాయంత్రం ఐదున్నరకు ఖమ్మం నడిబొడ్డున దాదాపు రెండు ఎకరాల స్థలంలో ఐటీ హబ్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కానున్న  ఈ హబ్ .. ఖమ్మం నగరానికి మణిమకుటంగా వెలుగొందనుంది. దాదాపు 15 అమెరికన్ ఐటీ కంపెనీలు ఖమ్మంలో తమ వ్యాపార లావాదేవీల నిర్వహణకు ఇప్పటికే అంగీకారం తెలిపాయి. శంకుస్థాపన సమయంలోనే 7 కంపెనీలకు ఐటీ హబ్‌లో కార్యకలాపాల కోసం అనుమతి పత్రాలను అందజేయనున్నారు మంత్రి కేటీఆర్.

ఐటీ-హబ్ ప్రారంభోత్సవం అనంతరం సాయంత్రం ఏడు గంటలకు ఖమ్మంలో భారీ బహిరంగసభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఈ సభను దిగ్విజయం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం గడ్డపై గులాబీ హవాను చాటిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.