భూసమస్యలు అరికట్టేందుకు చర్యలు

భూకబ్జాలు, నకిలీ డాక్యుమెంట్లు, బోగస్ రిజిస్ర్టేషన్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్‌ సిద్ధమైంది. భూములకు సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలోని భూములకు సంబంధించిన చరిత్రను సర్వే నెంబర్లవారీగా, రికార్డులను మ్యాపులతో సహా నెట్‌లో ఉంచాలని నిర్ణయించింది. ఈ వివరాల ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు జరిగేలా చూడాలన్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో రెవెన్యూ శాఖ, సీసీఎల్‌ఏ కార్యాలయ అధికారులు రంగంలోకి దిగారు.

తొలుత పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలాల్లోని భూముల వివరాలను అధికారులు సేకరించారు. భూముల సమగ్ర సమాచారాన్ని ఇంటిగ్రేటెడ్ రూరల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరిట రికార్డులు, మ్యాపులతో సహా ఇంటర్నెట్‌లో పొందుపరిచారు. సదాశివపేట మండలానికి సంబంధించిన ఏ భూమి గురించి తెలుసుకోవాలన్నా ప్రభుత్వ అఫీసులు తేదా మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగకుండా మాభూమి వెబ్ పోర్టల్‌ను డెవలప్ చేసి.. కేవలం ఒకే క్లిక్ తో సమగ్ర భూ రికార్డుల సమాచారం అందుబాటులో ఉంచారు. సదాశివపేట మండలంలో మాభూమి వెబ్ పోర్టల్ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని మండలాల రికార్డులను ఇంటర్నెట్‌లో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

మండలంలోని అన్ని సర్వే నెంబర్లు వాటి పహణీలు, గ్రామపటాలు, ఆధార్ లింకింగ్, టీపాన్లతో పాటు ఇతర వివరాలు మాభూమి వెబ్‌సైట్‌లో ఉంటాయి. వెబ్‌సైట్‌లో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రిజిస్ట్రీ అనే విభాగంలోకి వెళితే మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాపులో ఎక్కడ క్లిక్‌చేస్తే అక్కడ ఆ భూమి సర్వే నంబర్‌తో పాటు సమస్త సమాచారం ఉంటుంది. ముఖ్యంగా పహాణీ, ఆర్‌ఓఆర్, సేత్వార్, టీపాన్, భూమిపై వివాదాలు, కోర్టు ఇన్‌జంక్షన్ ఆర్డర్లు ఏమైనా ఉంటే ఆ వివరాలు, యజమానుల పేర్లు, భూముల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వం సెక్షన్ 22(ఏ) కింద నిషేధం విధించి ఉంటే ఆ వివరాలు, ఈసీతో సహా సమస్త సమాచారం అంతా ఒకదగ్గరే ఉంటుంది. దీనివల్ల.. భూమిని కొనుక్కోదలిచిన వాళ్లు ఆ భూమి వివరాల గురించి ఎక్కడెక్కడో అడిగి తెలుసుకోవాల్సిన పని లేకుండా, ఇంటర్నెట్‌లో ప్రభుత్వం అందించే కచ్చితమైన సమాచారాన్ని సులువుగా తెలుసుకోవటానికి వీలవుతుంది. భూమిని కొనుగోలు చేసిన తర్వాత.. వేరే దేశాలకు వెళ్లి అక్కడ ఉంటున్నప్పటికీ తమ భూమి వివరాలను ఇంటర్నెట్‌లో సరి చూసుకోవచ్చు. భూమి కబ్జాకు గురికావడం వంటి సమస్యలు తలెత్తితే వెంటనే రెవెన్యూశాఖను సంప్రదించి భూమిని కాపాడుకోవచ్చు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఇప్పటికే రెవెన్యూ సంబంధించిన సమగ్ర సమచారం పొందుపర్చి విజయవంతమవడంతో ప్రాజెక్టును రాష్ట్రమంతటా అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. భూముల సంబంధించిన పత్రాల కోసం గతంలో అఫీసుల చుట్టు రోజుల తరబడి తిరిగే వారమని.. కానీ ప్రభుత్వం తమ భూములను సంబంధించిన ఖచ్చితమైన సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు భూ యజమానులు.

మాభూమి వెబ్ పోర్టల్‌తో… నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి భూములు ఆక్రమించే కబ్జారాయుళ్ల ఆటలు సాగకుండా.. భూదందాలకు శాశ్వతంగా తెరపడనుంది.