భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకం చట్టానికి ఆరు సవరణలు

భూకబ్జాదారుల ఆట కట్టించడానికి ప్రభుత్వం చట్టాలకు పదును పెట్టింది. బోగస్ డాక్యుమెంట్లతో భూములు కాజేయాలనుకునే వారికి చెక్ పెట్టడానికి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకం చట్టానికి ప్రధానమైన ఆరు సవరణలు చేసింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి జడలు విప్పిందనే ఆరోపణలు పెద్దఎత్తున వచ్చిన నేపథ్యంలో వాటిని నిరోధించడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ లో ఈ మేరకు సవరణలు చేసింది. రిజిస్ట్రార్లు కాసులకు కక్కుర్తిపడి భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇది నిరోధిస్తుంది.

చట్ట సవరణలకు సంబంధించి.. మొత్తం భూముల రికార్డులను తెలంగాణ ల్యాండ్స్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేస్తారు. ఏ భూమిని అయినా ఈ సిస్టమ్‌లో పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే రిజిస్టర్ చేయాలి. ఏమాత్రం తప్పిదం చేసినా అందుకు రిజిస్ట్రార్ బాధ్యుడవుతారు. టీఎల్‌ఆర్‌ ఎంఎస్ ద్వారా రాష్ట్ర భూముల డేటాను సెంట్రలైజ్డ్ స్టోరేజ్ చేస్తారు.

భూమి రికార్డులను బ్యాంకులకు అనుసంధానం చేస్తారు. ఈ విధానం వల్ల రైతులు చిన్న చిన్న పనులు, పహాణీల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు అధికారులకు తమకు లింక్ అయిన ఆన్‌ లైన్ రికార్డులను పరిశీలించి రైతులకు రుణాలు ఇవ్వాలి. గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు వేర్వేరుగా ఇచ్చే పద్ధతిని రద్దు చేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పట్టాదారు పాస్ పుసక్తం, టైటిల్ డీడ్ కలిపి ఒకే పుస్తకంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పుస్తకాలను కూడా మీ- సేవ కేంద్రాల్లో తీసుకోవచ్చు. ఇకపై భూములను రిజిస్ట్రేషన్ తరువాత 15 రోజుల్లోనే మ్యుటేషన్ చేయాలి. దీనిని చట్టంలో తప్పనిసరి చేశారు.

ఇకపై రైతులు నేరుగా బ్యాంకుకు వెళ్లి సర్వే నంబర్ చెపితే చాలు.. ఆన్‌లైన్‌లో రికార్డులు పరిశీలించి నిర్ధారించుకొని వ్యవసాయ రుణాలు ఇస్తారు. రైతులు బ్యాంకుల్లో టైటిల్ డీడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి రికార్డులను కంప్యూటరీకరణ చేసి మా భూమి వెబ్ పోర్టల్‌లో పొందుపరిచింది. టీఎల్‌ఆర్‌ఎంఎస్‌లోనూ పొందు పరుస్తున్నది. దీంతోపాటు రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులు చేసింది. చట్టసవరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములను పరిరక్షించుకోవచ్చు.

భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకం చట్టంలో చేసిన ఆరు సవరణల ప్రకారం.. ఎమ్మార్వో ఆఫీసర్ తరువాత మాన్యువల్లీకి బదులు ఎలక్ట్రానిక్ అనే పదం చేర్చారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో తప్పులు ఉంటే సవరించే అధికారం తహశీల్దార్(ఎమ్మార్వో)కు  కల్పించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించే పట్టాదారు పాస్ పుస్తకం అనే దాన్ని ప్రధాన చట్టంలోని సెక్షన్ ఆరు కింద చూపించారు. ప్రధాన చట్టంలోని సెక్షన్ 6(ఎ) సబ్ సెక్షన్ 2లో 15 రోజుల్లో మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి అనే వాక్యాన్ని చేర్చారు.

సెక్షన్ 6(ఎ)లో సబ్‌ సెక్షన్ 4లో పట్టాదారు, తనఖాదారు, కిరాయిదారు అనే పదాలకు బదులుగా పట్టాదారు అనే పదం ఒక్కటే ఉంచారు. ప్రధాన చట్టం సెక్షన్ 6(సీ) ప్రకారం క్రెడిట్ ఏజెన్సీ ఆర్ఓఆర్ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేస్తుంది. పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ అడుగకుండానే ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో నిర్వహించే ఆర్‌ఓఆర్ ప్రాతిపదికన బ్యాంకులు రుణాలు మంజూరుచేస్తాయి.