భూకబ్జా కేసులో టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

భూకబ్జా కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న టీడీపీకి చెందిన ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు న్యాయవాది శైలేష్ సక్సెనా , సికింద్రాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి విలువైన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలకు నకిలీ పత్రాలు తయారు చేసి, కబ్జాలకు, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు కేసులున్నాయి. సక్సేనా చూపించే స్థలాలకు దీపక్ రెడ్డి పెట్టుబడులు పెడుతుంటాడు. నకిలీ పత్రాలతో హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వందల ఎకరాలను దీపక్ రెడ్డి గ్యాంగ్ కబ్జా చేసిందని ఆరోపణలున్నాయి.

విలువైన స్థలాన్ని వివాదం చేయడం,  వివాదం సద్దుమణిగిన తర్వాత వాటా పంచుకోవడం దీపక్ రెడ్డి గ్యాంగ్ దందా. గతంలో సీసీఎస్ లో ఈ గ్యాంగ్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. రెండింట్లో సక్సేనా బెయిల్ పొందగా… దీపక్ రెడ్డి తనపై ఉన్న రెండు కేసుల్లో ఒకదానిలో బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ వచ్చిన సక్సేనా, దీపక్ రెడ్డి, వీరికి సహకరించిన శ్రీనివాస్‌ విచారణ నిమిత్తం రెండు రోజులుగా సీసీఎస్‌ పోలీసుల ఎదుట హాజరవుతున్నారు. ఏసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం ముందుగా ఒక్కొక్కరిని విడిగా విచారించి, తరువాత ముగ్గురినీ కలిపి విచారించింది. విచారణకు సహకరించకపోవడంతో పాటు, అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

 

షేక్ పేట్ మండలంలోని సర్వే నెంబర్ 102/1 లోని ప్రభుత్వ భూమికి సంబంధించి గాయం మాధవరెడ్డి అనే వ్యక్తి పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశారు. హకీంపేట్‌కు చెందిన బాలయ్య, షఫీఖ్ అహ్మద్ ఖాన్, అహ్మద్‌ హుస్సేన్‌ల వద్ద ఆ స్థలాన్ని మాధవరెడ్డి కొనుగోలు చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ పత్రాలతో న్యాయస్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శైలేష్ సక్సేనా కేసులు వేశాడు. దీనిపై షేక్ పేట్ తహసీల్దార్ ఫిబ్రవరిలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు విచారించగా భూమి అమ్మినట్టుగా పత్రాల్లో పేర్లున్న వ్యక్తుల్లో కొందరు లేనే లేరు. మరికొందరు తమకు ఎలాంటి స్థలాలు ఎక్కడా లేవని తెలిపారు. ఆసిఫ్ నగర్‌లోని భోజగుట్ట ప్రాంతంలోని స్థలాలు, బంజారా హిల్స్ లోని ప్రైవేటు స్థలాలు కూడా ఈ ముఠా కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.

దీపక్ రెడ్డి  గ్యాంగ్ నకిలీ వ్యక్తులను సృష్టించి రకరకాల పేర్లతో  వారిని వాడుకున్న విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో అరెస్టైన శివభూషణం గుట్టు విప్పాడు. మొఘల్ పురాకు చెందిన శైలేష్ సక్సేనాతో 2000 సంవత్సరంలో శివభూషణానికి పరిచయం ఏర్పడింది. అవసరమున్నప్పుడల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి, తాను చెప్పిన పేరుతో సంతకం చేయాలని అందుకు కొంత డబ్బు ఇస్తానని మభ్యపెట్టాడు. ఇంట్లో పెండ్లిళ్లు, కుటుంబ అవసరాలకు కావాల్సిన డబ్బు ఇస్తాననడంతో శివభూషణం ఒప్పుకున్నాడు. 2004లో భోజగుట్టలో ఉన్న సుమారు రూ.300 కోట్ల విలువైన 78 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు శైలేష్ సక్సేనా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ స్థలాన్ని తనకు యజమాని ఇక్బాల్ ఇస్లాంఖాన్ అమ్మినట్టు నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఇక్బాల్ ఇస్లాంఖాన్ అనే వ్యక్తి లేడని, అర్జెంటుగా అతని సంతకాలు అవసరమున్నాయంటూ నమ్మించి శివభూషణంతో సంతకాలు చేయించాడు.  ఈ పత్రాలతో కోర్టులో సివిల్ సూట్‌ వేశాడు. కోర్టులో కేసుల సమయంలో శివభూషణంనే ఇస్లాంఖాన్‌ అంటూ చూపించాడు. తాను కోర్టుకు హాజరయ్యే సమయంలో తన వెంట సక్సేనా అనుచరులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడా ఉండేవారని శివభూషణం పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు.

కనిపించిన స్థలాలకు నకిలీ పత్రాలు తయారు చేయడం, అమ్మిన వ్యక్తి అంటూ ఒక బినామీ వ్యక్తిని ముందు పెట్టి సక్సేనా ముఠా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు సీసీఎస్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇందుకు కచ్చితమైన ఆధారాలు సేకరించి, పకడ్బందీ వ్యూహంతో సక్సేనాతో పాటు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని అరెస్ట్ చేశారు.