భూకబ్జాదారులకు సర్కారు చెక్   

భూకబ్జాలపై ప్రభుత్వం సీరియస్‌ గా ఉన్నది. కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నిజాం, గద్వాల, వనపర్తి, కొల్హాపూర్, దోమకొండ లో సంస్థానాలు ఉన్నాయి. దీనికితోడు మునగాల పరగణ కూడా సంస్థానమే. ఈ సంస్థానాల పరిధిలో పెద్దఎత్తున జాగీర్, ఇనామ్ భూములు ఉన్నాయి. భారత ప్రభుత్వం 1948లో జాగీర్‌లు రద్దుచేసి భూమితోపాటు కొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేసింది. అయితే ఇలాంటి భూములకు విలువ పెరగడంతో భారీఎత్తున కబ్జాలకు గురయ్యాయి. ఇటీవల మియాపూర్‌లో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో సీరియస్ అయిన ప్రభుత్వం భూకబ్జాలకు ఆస్కారం లేకుండా, గతంలో జరిగిన కబ్జా భూములను కూడా స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ఆర్‌ఓఆర్ చట్టానికి సవరణలు చేసింది.

రాష్ట్రంలో జాగీర్, మక్తా, ఇనామ్ భూములు ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, వాటి వాస్తవ పరిస్థితి, ప్రభుత్వ ఆధీనంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, లిటిగేషన్‌లో ఎన్ని ఎకరాల భూమి ఉందనే వివరాలను ప్రభుత్వం కలెక్టర్ల నుంచి తెప్పించుకుంటున్నది. ఇదే సమయంలో కబ్జా అయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటే పేదలకు నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు భూమి కొరత ఉండదు. ఇప్పటికే ఇందుకుసంబంధించి ప్రభుత్వం.. రెవెన్యూ యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది.