భారత్-రష్యా బంధం 70 ఏళ్లది!

ప్రధాని మోడీ  విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాణిజ్యం, రక్షణ సహకారంతోపాటుగా వివిధ అంశాలపై మొత్తం ఐదు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అందులో కుడంకుళం ఒప్పందం ప్రముఖంగా నిలిచింది. తమిళనాడులోని కుడంకుళం అణు కేంద్రంలోని చివరి రెండు యూనిట్ల నిర్మాణంపై  భారత్, రష్యాలు విధివిధానాలు ఖరారు చేశాయి. వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్రసభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సెయింట్ పీటర్స్‌ బర్గ్‌ లో ఉభయదేశాల అధినేతలు సుదీర్ఘ మంతనాలు సాగించారు.

వాణిజ్య విస్తరణ దిశగా యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఏర్పాటు అంశం ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తున్నది. స్వతంత్ర క్రెడిట్ రేటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఉభయపక్షాలూ అంగీకరించాయి. ప్రస్తుత గ్లోబల్ రేటింగ్ వ్యవస్థలు అమెరికా, చైనాల వైపు మొగ్గు చూపుతాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కీలక అంశం భారత్‌, రష్యా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఇక రెండుదేశాల సన్నిహిత మైత్రి పై మోడీ, పుతిన్ లు సంతోషం వ్యక్తం చేశారు. భారత్- రష్యాల బంధం 70 ఏళ్లదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సాంస్కృతిక, వాణిజ్య, పర్యాటకంతో పాటు రక్షణ రంగంలోనూ ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకుంటున్నాయని చెప్పారు.  భారత్ తో రష్యా బంధం మరింత బలోపేతమయ్యేందుకు ఇరు దేశాల మధ్య వ్యాపారం చేసే సంస్థలు కూడా దోహదం చేశాయన్నారు. విద్యుత్, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య ఇంధన వారధి నిర్మించడంతో పాటు.. కుడంకుళం అణుకేంద్రంలో చివరివైన 5, 6 యూనిట్ల నిర్మాణంపై సాధారణ నిబంధన ఒప్పందం, రుణవిధానంపై ఏకాభిప్రాయం కుదరడం హర్షదాయక మని ప్రధాని మోదీ అన్నారు. రెండు యూనిట్ల ఉత్పాదక సామర్థ్యం వెయ్యేసి మెగావాట్ల చొప్పున ఉంటుంది. శిఖరాగ్ర చర్చల సందర్భంగా 21వ శతాబ్దపు దార్శనిక పత్రం కూడా విడుదల చేశారు. ప్రపంచదేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరాదని అందులో విజ్ఞప్తి చేసారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తున్నట్టు తెలిపారు. వైమానిక రంగంలో సహకారాన్ని విస్తరించుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. 2020 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వైమానిక రంగంగా భారత్ అభివృద్ధి చెందుతుందని దార్శనిక పత్రంలో పేర్కొన్నారు.

అటు ఇండో-రష్యా శిఖరాగ్ర సమావేశం మాస్కో వెలుపల జరుగడం ఇదే తొలిసారి.  అదీ పుతిన్ సొంతగడ్డ సెయింట్ పీటర్స్‌ బర్గ్‌ లో జరుగడం విశేషం. ఉదయమే నగరంలోని పిస్కారెస్కొయె యుద్ధస్మారకానికి వెళ్లి రెండోప్రపంచయుద్ధం అమరవీరులకు మోడీ నివాళి అర్పించారు. పుతిన్ త్యాగధనుల కుటుంబం నుంచి వచ్చిన నేతగా ప్రశంసించారు. ఇక  రాజకీయ, ఆర్థిక, సైనిక సహకార కూటమి షాంఘై సహకార సంస్థ లో భారత్ మరో వారంరోజుల్లో సభ్యత్వం పొందుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. తమ దేశం తరఫున ఆయన ఆమోదం తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి, అణుసరఫరా దేశాల బృందంలో భారత్ సభ్యత్వానికి కూడా ఆయన మద్దతు తెలిపారు.

పాకిస్థాన్‌తో తమకు సన్నిహిత సైనిక సంబంధాలు లేవని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. భారత్‌తో స్నేహబంధం తరిగిపోయేది కాదన్నారు. క్షిపణుల తయారీ వంటి సున్నిత వ్యవహారాల్లో రష్యాకు భారత్‌ను మించిన సన్నిహిత మిత్రదేశం మరొకటి లేదని పుతిన్ తెలిపారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాక్ ఎగదోస్తున్నదో లేదో  అనేది భారతే తేల్చుకోవాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌కు రష్యా అండదండలు తప్పనిసరిగా ఉంటాయని స్పష్టం చేశారు. ఉగ్రదాడులు ఆపాల్సిందిగా పాకిస్థాన్‌కు చెప్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు రష్యా హ్యాకింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అలాంటి పనికి పాల్పడబోదని స్పష్టం చేశారు.