భారత్‌-అమెరికా కలిస్తే ప్రపంచానికి మేలు

భారత్‌, అమెరికా వ్యూహాత్మక సంబంధాలు వివాదరహితమని, ప్రపంచాన్ని ఉగ్రవాదం, తీవవ్రాదం నుంచి రక్షించడానికి, సంప్రదాయేతర ఉగ్రవాద ముప్పు నుంచి కాపాడేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఆయన ఓ ప్రత్యేక వ్యాసం రాశారు. బెల్ట్‌వే, రైసినా హిల్స్‌కు అతీతమైన బంధం ఇరుదేశాల మధ్య ఉందని తెలిపారు. గత జూన్‌లో తాను అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఏడాది తర్వాత.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయన్న నమ్మకంతో వచ్చానని రాశారు. భారత్‌, అమెరికా ఎప్పుడుకలిసి పనిచేసినా, ప్రపంచానికి మేలు కలిగిందన్నారు. డెంగ్యూ వ్యాక్సిన్‌ కనుక్కోవడం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రకృతి విపత్తుల సమయంలో మానవీయ సాయంలాంటి ఉదాహరణలను పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రం విషయాన్నీ ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం ఏడాదికి 115 బిలియన్‌ డాలర్లు దాటిందని, మరిన్ని రెట్లు పెరిగేందుకు సిద్ధంగా ఉందన్నారు. భారత్‌లో 100 స్మార్ట్‌ సిటీలు అభివృద్ధి చేస్తున్నామని, ఓడరేవులను, విమానాశ్రయాలను ఆధునికీకరిస్తున్నామని, దేశంలో అందరికీ 2022 నాటికి ఇళ్ల నిర్మిస్తున్నామని తెలిపారు.