భారత్‌కు చెక్కుచెదరని దోస్త్ రష్యా

భారత, రష్యా దౌత్య సంబందాలకు 70 ఏండ్లు నిండిన సందర్భంగా ప్రధాని మోడీ రష్యా పత్రిక రోసిస్కయా గజేతాకు, అధ్యక్షుడు పుతిన్ మనదేశం నుంచి వెలువడే ఆంగ్లపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక వ్యాసాలు రాశారు. మే 30, 31 తేదీ సంచికల్లో వచ్చిన ఈ వ్యాసాల్లో ఉభయనేతలు ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిపై సింహావలోకనం జరిపారు. ఇరు దేశాలది అపురూపమైన బంధమని చెప్పారు.

“భారత్ ఇంకా స్వాతంత్య్రం పొందక మునుపే 1947 ఏప్రిల్ 13న రష్యా భారత్‌ను గుర్తించి దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నది. ఇప్పుడు ఆ బంధం 70వ మైలురాయిని దాటింది. 1947 నుంచి నిరంతరంగా మారుతున్న ప్రపంచంలో నిలకడగా నిలిచింది రెండు దేశాల స్నేహమే. సమానత్వం, విశ్వాసం, పరస్పర ప్రయోజన సూత్రాలపై ఆ బంధం ఏర్పడింది. బొకారో, భిలాయ్ కర్మాగారాలు, భాక్రానంగల్ డ్యాం, వింగ్ కమాండర్ రాకేశ్‌శర్మ తొలివ్యోమగామిగా జరిపిన అంతరిక్షయాత్ర దృశ్యాలు ప్రతి భారతీయుని మనసులో ముద్ర వేసుకున్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు కవిత్వం రష్యన్ భాషలోకి అనువాదమైంది. భారత జాతిపిత మహాత్మాగాంధీ రష్యా మహారచయిత టాల్‌స్టాయ్‌తో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపిన విషయం మనం గుర్తుచేసుకోవాలి. యోగా, భారతీయ చిత్రాలు, పాటలు, నృత్యాలు రెండు దేశాల ప్రజల మధ్య సాన్నిహిత్యం పెంచాయి. 2001లో అప్పటి ప్రధాని వాజపేయితో కలిసి రష్యాలో జరిపిన పర్యటనను ఎన్నటికీ మరిచిపోలేను. 2000లో రెండుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్య ప్రకటన వెలువడింది. 2010లో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రక్షణ సహకారం ఇరువురికీ అత్యంత కీలకం. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల్లో రష్యా కంపెనీలు పాల్గొనాలి. భారత్-రష్యా మైత్రి జిందాబాద్” అని ప్రధాని మోడీ తన వ్యాసంలో రాశారు.