భారత్‌కు అండగా నిలిచినందుకు గర్విస్తున్నాం

భారత, రష్యా దౌత్య సంబందాలకు 70 ఏండ్లు నిండిన సందర్భంగా ప్రధాని మోడీ రష్యా పత్రిక రోసిస్కయా గజేతాకు, అధ్యక్షుడు పుతిన్ మనదేశం నుంచి వెలువడే ఆంగ్లపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక వ్యాసాలు రాశారు. మే 30, 31 తేదీ సంచికల్లో వచ్చిన ఈ వ్యాసాల్లో ఉభయనేతలు ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిపై సింహావలోకనం జరిపారు. ఇరు దేశాలది అపురూపమైన బంధమని చెప్పారు.

“స్వాతంత్య్రానికి ముందునుంచే భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. రష్యా భారత్‌కు అందించిన సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. స్వాతంత్య్రానికి ముందే భారత్‌ను గుర్తించడం ద్వారా జాతీయ విముక్తికి తోడ్పాటును, తర్వాతికాలంలో స్వాతంత్య్రానికి సోవియట్ యూనియన్ అండదండలను అందించింది. స్వాతంత్య్రానంతరమూ సహాయ సహకారాల్ని అందించింది. భిలాయ్, విశాఖపట్నం, బొకారో ఉక్కు కర్మాగారాలను, దుర్గాపూర్ పరికరాల తయారీ కేంద్రం, నెయ్‌వేలీ థర్మల్ విద్యుత్కేంద్రం, కోర్బా యంత్రాల కేంద్రం, రిషికేశ్, హైదరాబాద్‌లోని ఔషధ పరిశ్రమలు ఇలా ఎన్నో ఇరుదేశాల మైత్రికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సోవియట్ శాస్త్రజ్ఞులు, అనంతరకాలంలో రష్యా శాస్త్రజ్ఞులు భారత్‌లో బాంబే ఐఐటీ, డెహ్రాడూన్, అహ్మదాబాద్ పెట్రోలియం పరిశోధన కేంద్రాల వంటి ఉన్నతస్థాయి సంస్థల ఏర్పాటులో కీలకపాత్ర నిర్వహించారు. భారత అంతరిక్ష పరిశోధనలకు తమ నిపుణులు తోడ్పాటు అందించారు. 21వ శతాబ్దపు సవాళ్లను, సమస్యలను కలిసిమెలిసి ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. భారత్‌, రష్యా, ప్రపంచ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా సహకారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. భారత ప్రజలకు నా శుభాకాంక్షలు” అని పుతిన్ తన వ్యాసంలో వెల్లడించారు.