భరత్ అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ సినీ హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డుప్రమాదంలో కన్నుమూశారు. శనివారం రాత్రి పదిగంటలకు ఔటర్ రింగ్ రోడ్ పై భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జయింది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకున్నప్పటికీ అతి వేగానికి పగిలిపోయింది. స్టీరింగ్‌ విరిగిపోయింది. స్పీడోమీటర్‌ 140 కిలోమీటర్ల పైన ఆగిపోయింది. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పలు సినిమాల్లో భరత్ కేరక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. గతంలో  పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది.

అటు  భరత్ అంత్యక్రియలు జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం డెడ్ బాడీని మహాప్రస్థానానికి తరలించారు. పలువురు సినీ ప్రముఖులు భరత్ భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళి అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.