భగీరథ, ప్రాజెక్టులకు పన్ను మినహాయింపుపై స్పందించలేదు

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ముఖ్యమైన అంశాలపై కేంద్రం పెద్దగా స్పందించలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్టీలో మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 34 ప్రతిపాదనలు ఇస్తే కళ్లద్దాలు, వినోదంపై పన్నుల్లో మార్పులు చేశారని వెల్లడించారు. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ భేటి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ, కోటి ఎకరాలకు నీరందించేందుకు భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిందని మంత్రి రాజేందర్ గుర్తుచేశారు. వీటికి పన్ను నుంచి మినహాయించాలని, గతంలో ఉన్న విధంగా పన్నులు ఉంచాలని కోరామని వెల్లడించారు. వీటిపై సీఎం కేసీఆర్ కూడా కేంద్రానికి లేఖ రాశారని,  కేంద్రం స్పందించలేదన్నారు.

జీఎస్టీలో సూచనలు, మార్పులు, చేర్పులపై తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక బుక్ ను  కౌన్సిల్ సభ్యులకు అందజేశామని మంత్రి రాజేందర్ తెలిపారు. సామాన్య ప్రజలు కట్టుకునే ఇండ్లపై ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరామన్నారు. గ్రానైట్ స్లాబ్ మీద 16.2 శాతం పన్ను ఉండేదని, దానిని 28 శాతానికి పెంచారని, దానిని తగ్గించాలని కోరామన్నారు. చిన్నతరహా పరిశ్రమలపై భారం తగ్గించాలని కోరామని, కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో లేదన్నారు. 100 రూపాయల లోపు ఉన్న సినిమా టికెట్ ధరపై 18 శాతం, రూ.100కు పైగా ఉన్న టికెట్ ధరపై 28 శాతం పన్ను నిర్ణయించారని చెప్పారు.

మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా అని మాటల పరంగానే కాకుండా దానికి తగ్గట్టు చిన్న పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని మంత్రి ఈటెల కోరారు. గతంలో రూ.కోటి 50 లక్షలు, ఆ పైన టర్నోవర్ ఉన్న పరిశ్రమలకు పన్ను విధించే వారని, ప్రస్తుతం దాన్ని 75 లక్షలకు తగ్గించడం చిన్న పరిశ్రమలకు భారమేనన్నారు. మల్టీనేషనల్ కంపెనీల దాడి తట్టుకోలేక చిన్న కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. స్టార్ హోటల్ కు, నాన్ స్టార్ హోటల్ కు ఒకే విధమైన పన్ను కాకుండా.. నాన్ స్టార్ హోటళ్లకు 5 శాతం పన్ను విధించాలని కోరామని తెలిపారు. హైదరాబాద్ లో హార్స్ రేసింగ్ కి సంబంధించిన పన్నుపై చర్చ జరగలేదని వెల్లడించారు.

వచ్చే నెల 1 నుంచి అమలు చేయనున్న జీఎస్టీపై ప్రజలు భయాందోళన చెందకుండా చూడాలని చెప్పామని మంత్రి రాజేందర్ అన్నారు. జీఎస్టీకి విఘాతం కలగవద్దని, పన్ను ఎగవేతకు దారి తీయకుండా చూడాలని కోరామని చెప్పారు. ఈ నెల 18వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశం అవుతుందని తెలిపారు.