బ్రాహ్మణ సంక్షేమ సదనానికి నేడు సీఎం శంకుస్థాపన

అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ కులసంఘాలకు సంక్షేమ భవనాలు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ శివారు గోపన్నపల్లిలో బ్రాహ్మణ సంక్షేమ సదన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్  శంకుస్థాపన చేయనున్నారు. జర్నలిస్టు కాలనీ సమీపంలో ఆరు ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మించే ఈ సదనంలో సకల సదుపాయాలు కల్పించనున్నారు.

బ్రాహ్మణ సంక్షేమ సదనంలో విశాలమైన పెండ్లి మండపం, అతిథుల వాహనాలకు ఇబ్బంది లేకుండా చక్కని పార్కింగ్ సౌకర్యాన్ని  ఏర్పాటుచేస్తారు. సమాచార కేంద్రంలో వేదవిజ్ఞానం, మతగ్రంథాలతో కూడిన సమగ్ర పుస్తక భాండాగారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణం, స్వామీజీలు బసచేయడానికి ఏర్పాట్లతోపాటు వారు అనుగ్రహభాషణం ఇవ్వడానికి వీలుగా సమావేశ మందిరం, దూరప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే బ్రాహ్మణులు బసచేయడానికి భవన సముదాయంలో వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. బ్రాహ్మణ సదన నిర్మాణం కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి, వైస్ చైర్మన్ వనం జ్వాలా నరసింహారావు, సీఈవో చంద్రమోహన్, తెలంగాణ మాస పత్రిక సంపాదకులు అష్టకాల రామ్మోహన్, దర్శనం శర్మ, భవన సముదాయ రూపశిల్పి జీవీఆర్ రవి శ్రమిస్తున్నారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ వేదపాఠశాలల వేదపండితులు, ఘనాపాఠీలు, వేద విద్యార్థులతోపాటు ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి, ఎం వెంకటరమణశర్మ, ప్రవచననిధి బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి, రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, ఆలయ భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్ అవధాని మోహనశర్మ తదితరులు పాల్గొననున్నారు.