బ్యూటీషియన్, ఎస్సై సూసైడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి, బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్యలపై దర్యాప్తు  ముమ్మరంగా కొనసాగుతున్నది. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యపై టాస్క్ ఫోర్స్ పోలీసులు,   ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న బృందం దర్యాప్తు చేస్తున్నది. డీఎస్పీ తిరుపతన్న బృందం, బంజారాహిల్స్ పోలీసులను సంప్రదించి శిరీష ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. మరోవైపు పోస్ట్‌ మార్టం ప్రాథమిక నివేదికలో శిరీష ఒంటిపై గాయాలు ఉన్నట్లు వెలుగు చూడటంతో పోలీసులు ఈ ఘటనలతో సంబంధం ఉన్న ఆర్‌జే ఫొటోస్ సంస్థ నిర్వాహకుడు రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ చెప్పిన విషయాల ఆధారంగా   క్రైం సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇందులో ఫోరెన్సిక్, వైద్య నిపుణులు, ఇతర శాఖలకు సంబంధించిన నిపుణులు కూడా పాల్గొన్నారు

దాదాపు నాలుగు గంటలపాటు స్టూడియో వద్దే ఉన్న పోలీసులు, నిపుణుల బృందం అన్నికోణాల్లో శాస్త్రీయ పద్ధతిలో పరిశోధించారు. కాగా శిరీష మరణం వెనుక ఎలాంటి అనుమానాలు లేవని, అది ఆత్మహత్యేనని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. నిపుణుల బృందం తమ పరిశోధన నివేదిక ఇవాళ ఇవ్వనున్నారని, మధ్యాహ్నంలోపు మిస్టరీ వీడనుందని పోలీసు అధికారులు చెప్తున్నారు. కాగా ఇవాళ మీడియా ముందు నింధితులు శ్రావణ్‌,రాజీవ్ లను  ప్రవేశపెడతామని వెస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. . .

కాగా ఎస్సై ప్రభాకర్‌రెడ్డి క్వార్టర్స్‌లో ఏం జరిగిందనే దానిపై పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారని తెలుస్తున్నది. ప్రభాకర్‌రెడ్డి శిరీష పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని రాజీవ్ పోలీసులకు చెప్పగా, కేవలం శిరీషను మందలించడం మాత్రమే జరిగిందని శ్రావణ్ చెప్పినట్లు సమాచారం. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్లో జరుగుతున్న దర్యాప్తు గురించి తనకు పరిచయం ఉన్న ఓ ఎస్సై ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు సమాచారం. శిరీష ఆత్మహత్య కేసు దర్యాప్తులో తనపేరు బయటకు వస్తుందన్న భయంతో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తున్నది.