బోర్లను పూడ్చకపోతే క్రిమినల్ కేసులు

రాష్ట్రంలో రెండు రోజులుగా బోర్ల గుర్తింపు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. గ్రామాల్లో వీఆర్వోలు ఉపయోగంలో లేని బావులను గుర్తించే పనిలో ఉన్నారు. గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ స్థాయిలో ఉండే యువజన సంఘాల ద్వారా బోర్లకు చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. వినియోగంలో లేని బోర్లను వెంటనే మూసి వేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. బోర్లను పూడ్చకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందని బోర్ల యజమానులకు వివరిస్తున్నారు.

ఉపయోగంలోని లేని బోరుబావి కారణంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డి పల్లిలో చిన్నారి మృతి ఘటన రాష్ట్ర ప్రజలను కలిచివేసింది. ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా తీసుకుంది. బోర్లను నిర్లక్ష్యంగా వదిలివేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టంగా ఆదేశించింది. గతంలో 2015 నవంబర్ లో మెదక్ జిల్లా బొమ్మగూడెంలో రాకేశ్ అనే బాలుడు బోరు బావిలో పడి మరణించాడు. 2016 ఫిబ్రవరిలో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో శాన్వి అనే చిన్నారి కూడా ఇదే రీతిలో ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు అధికారులు కొద్దిరోజులు హడావుడి చేసి ఆ తర్వాత మరిచిపోతున్నారు.

ఉపయోగంలో లేని బోరుబావులను మూసివేయాలని, ఉపయోగపడే బావులకు కంచెలు వేయించాలని గతంలోనే ఆదేశాలిచ్చారు మంత్రి కేటీఆర్‌. అలాంటి బావులను సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు గుర్తించాలని ఆదేశించారు. అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరించగా 2016 ఫిబ్రవరిలో మరో సంఘటన జరుగడంతో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అయినా అధికారుల వైఖరిలో మార్పు రాలేదని తాజా సంఘటన రుజువు చేసింది. బోర్లు వదిలేయడం వల్ల అనర్థాలపై ప్రజల్లో అవగాహన కలిగించడంతో పాటు వీటిపై కన్నేసి ఉంచాల్సిన అధికారులు తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మంత్రులు కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. మంత్రి మహేందర్‌రెడ్డి ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.