బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

జంట నగరాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌నలు జ‌ర‌గ‌కుండా పోలీసులు భ‌ద్ర‌త ప‌రంగా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. హోంమంత్రి నాయిని అధ్యక్షతన బోనాల పండుగ నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు.  మంత్రులు తలసాని, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, మేయర్ రామ్మోహన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

బోనాల్లో డీజేలకు అనుమ‌తి లేద‌ని, మైకులనే వాడాల‌ని హోంమంత్రి నాయిని స్ప‌ష్టం చేశారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌న్నారు. హైద‌రాబాద్ మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌ని, అన్ని వర్గాలు సహకరించి బోనాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని కోరారు. రంజాన్, క్రిస్మస్ తో పాటు ఇత‌ర మ‌తాల పండ‌గ‌లను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘ‌నంగా నిర్వహిస్తున్నార‌ని చెప్పారు.

తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌న్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. బోనాల ఉత్సవాల్లో భ‌క్తులు అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. బోనాల కోసం వివిధ ప్రాంతాల్లో పనులకు గాను సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. న‌గ‌రంలోని అన్ని ఆల‌యాల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేస్తున్నామన్నారు. హైద‌రా‌బాద్ లో బోనాల పండగ అతి పెద్ద‌ద‌ని, తెలంగాణ‌లో బోనాల‌తోనే పండగ‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని మంత్రి వెల్లడించారు.

గ‌తేడాది లాగే ఈసారి కూడా బోనాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌న్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. బోనాల ఉత్సవాల్లో పారిశుధ్యం, ప‌రిశుభ్ర‌త, తాగు నీరు, విద్యుత్ తో పాటు ఇత‌ర సౌక‌ర్యాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో బోనాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.