బోనాల ఏర్పాట్లపై తలసాని సమీక్ష

హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, వాటర్‌ వర్క్స్, ఎండోమెంట్‌, విద్యుత్‌ తో పాటు ఇతర శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 25 నుంచి జూలై 23 వరకు జంట నగరాల్లో ఆషాఢమాస బోనాలు జరుగుతాయన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25న లంగర్‌ హౌజ్‌ చౌరస్తా నుంచి గోల్కొండ వరకు తొట్టెల ఊరేగింపు ఉంటుందన్నారు మంత్రి తలసాని. ఈ ఊరేగింపుతో  గోల్కొండలోని శ్రీ జగదాంబ మహాంకాళి ఆలయంలో బోనాల జాతర మొదలవుతుందని తెలిపారు. అదే రోజున అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించున్నట్లు చెప్పారు. బోనాల ఉత్సవాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి తలసాని  సూచించారు. భక్తుల తాకిడి అధికంగా ఉంటున్నందున పరిసరాల పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. తోపులాట జరగకుండా భారీకేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు క్యూ లైన్లో నిల్చునే భక్తులకు మంచినీరు సరఫరా చేయాలన్నారు. లైటింగ్, పూల అలంకరణ సాంప్రదాయ బద్దంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పాడకుండా మొబైల్ ట్రాన్స్‌ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. మరోవైపు ఆలయాల పరిసరాల్లో రెండు మెడికల్‌ క్యాంపులను, రెండు అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులను.. మంత్రి  ఆదేశించారు. ఉత్సవాలను పర్యవేక్షించేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

బోనాల పండుగ బ్రహ్మాండంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు  మంత్రి తలసాని. అధికారులు, కార్పొరేటర్లు ఫీల్డ్ విజిట్ చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ నెల 15న మరోసారి అధికారులు, కార్పోరేటర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు.