ప్రియురాలి పక్కనే ప్రియుడు!

గత మూడేళ్లుగా నిరాటంకంగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నారు బాలీవుడ్ జోడీ రణవీర్‌సింగ్, దీపికాపదుకునే. ఈ జంట మధ్య ఏవో మసస్పర్థలు తలెత్తాయని వార్తలొచ్చినా అవన్నీ ఉత్తవేనని తేలింది. ప్రస్తుతం దీపికాపదుకునే ముంబయిలో వుంటున్న ఫ్లాట్ పక్కనే రణవీర్‌సింగ్ కూడా మరో ఫ్లాట్‌ కొన్నాడట. ముంబయిలోని జో మోంద్ అనే అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో దీపికాపదుకునే నివాసం వుంటున్నది. ఆమె పక్క ఫ్లాట్‌ను ఇటీవలే రణవీర్‌సింగ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రియుడి సాంగత్యంలో ఎక్కువసేపు గడుపలేకపోతున్నానని బాధపడుతోందట దీపికా. రణవీర్‌సింగ్ పక్కనే వుంటే మరింత విలువైన సమయాన్ని అతనితో ఆస్వాదించే వీలుంటుందని భావించిందట. అందుకే ప్రియుడితో ఫ్లాట్‌ను కొనిపించిందట. ప్రస్తుతం వీరిద్దరు కలిసి పద్మావతి చిత్రంలో నటిస్తున్నారు.