ప్రశాంతంగా ముగిసిన చేపప్రసాదం పంపిణీ

ప్రతిఏటా మృగశిర కార్తె రోజున బత్తిన సోదరులు చేపప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ మొదలుకొని పలు శాఖలు సమన్వయంతో పనిచేశాయి. పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కూడా నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి బస్సుల్ని నడిపింది. దీంతో భారీగా తరలిచ్చిన జనానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.

ఈసారి మహిళలు, వికలాంగులు, వృద్ధులకోసం ప్రత్యేకంగా  32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అన్ని డిపార్టుమెంట్లకు ఐడీ కార్డులిచ్చారు. అన్ని శాఖల అధికారులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. చేప ప్రసాదం పంపిణీ చేసేవాళ్లను నాలుగు బ్యాచులుగా విభజించారు. షిఫ్టుల వారీగా ఈ  పంపిణీ జరిగింది. భారీగా తరలివచ్చిన జనం కోసం మత్స్యశాఖ ఆధ్వర్యంలో సరిపడా కొరమీన్లను అందుబాటులో ఉంచారు. పలు స్వచ్ఛంధ సంస్థల వాలెంటీర్లు సహాయ సహకారాలందించారు. ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా మంత్రులు దగ్గరుండి చేపప్రసాదం పంపిణీని పరిశీలించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు.

చేపప్రసాదానికి  మన రాష్ట్రం నుంచే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివచ్చారు. లక్షా యాభై వేల మందికి పైగా ప్రసాదాన్ని స్వీకరించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  ప్రభుత్వం కల్పించిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు.

బత్తిన కుటుంబసభ్యులు ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నా… గత ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేప్రసాదానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కూడా పెద్దెత్తున ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం అంచనాలకు మించి విజయవంతమైంది. అందుకే బత్తిన కుటుంబసభ్యులు రాష్ట్రప్రభుత్వానికి మనసారా ధన్యవాదాలు తెలిపారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు రాలేకపోయిన వారికోసం … బత్తిన కుటుంబసభ్యులు శుక్రవారం హైదరాబాద్ లో పలుచోట్ల చేపప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. మొత్తానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.