ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష

ప్రైవేట్ వ్యక్తుల పేరిట హైదరాబాద్ శివార్లలోని ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారానికి సంబంధించి ఇటీవల వెలుగుచూసిన అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మియాపూర్, బాలానగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిపై హక్కులు సంపాదించడానికి సబ్ రిజిస్ట్రార్ల సహకారంతో జరిగిన దందాపై విస్తృతంగా చర్చించారు.

ఈ మొత్తం వ్యవహారంలో వెల్లడైన విషయాలు ఇలా ఉన్నాయి:

‘మియాపూర్ లో 810 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు లిటిగేషన్ రైట్స్ కల్పిస్తూ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి ఇది భూమి బదలాయింపు (transfer of land) రిజిస్ట్రేషన్ కాదు. లిటిగేషన్ రైట్స్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్. ఒక వేళ అది భూ బదలాయింపు రిజిస్ట్రేషనే అయితే, మొత్తం భూమి విలువకు రిజిస్ట్రేషన్ చార్జి రూ. 415 కోట్లు అయ్యేది. కానీ ఈ రిజిస్ట్రేషన్ కోసం రూ.60 లక్షలు కట్టారు. ఇది కూడా రిజిస్ట్రేషన్ కోసం ఎంతో కొంత కట్టాలి అన్నట్లు కట్టారు తప్ప, ఈ చార్జి వేయడానికి ఏ ప్రాతిపదిక లేదు. ఇక ఈ భూమిని  స్థిరాస్తి (Immovable property) రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే భూమి బదలాయింపు రిజిస్ట్రేషన్ బుక్ 1లో రికార్డ్ చేయాలి. కానీ ఇక్కడ చరాస్తి (Movable property) రిజిస్ట్రేషన్ చేసే బుక్ 4లో రిజిష్టర్ చేశారు. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ కు ఏమాత్రం విలువలేదు. ఎక్కడా చెల్లుబాటు కాదు.

కొందరు వ్యక్తులు ఎప్పుడో రద్దయిన జాగీర్ భూములపై హక్కులు సంపాదించడానికి కోర్టులో కేసులు వేసి ఉన్నారు. సివిల్ కోర్టుల నుంచి హైకోర్టు వరకు ఎక్కడా వారి వాదన నెగ్గలేదు. దీంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసులో వాదనకు బలం చేకూరడానికి ఈ హక్కు పత్రాలు సంపాదించడానికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారిని, బాధ్యులపై చర్యలు తసుకున్నది. రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. కాబట్టి మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా నష్టం కలగలేదు. ఒక్క గజం స్థలం కూడా ఎవరి ఆధీనంలోకి పోలేదు. కోర్టు కేసుల్లో కూడా ప్రైవేటు వ్యక్తులకు బలం చేకూరే అవకాశం లేదు. ఇది ప్రభుత్వ భూమి అని నోటిఫై చేస్తూ ఈ వివరాలను ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లకు పంపింది. అది తెలిసి కూడా సబ్ రిజిస్ట్రార్ ఈ భూములను రిజిష్టర్ చేసినట్లు తేలింది. పూర్తిగా సబ్ రిజిష్ట్రార్ చేసిన తప్పుగానే ఇది కనిపిస్తున్నది.’

‘ఇక బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మియాపూర్ తో పాటు మరో ఏడు గ్రామాల భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిష్టర్ చేసిన వ్యవహారం కూడా ఇలాగే ఉంది. ఇక్కడ కూడా భూమి బదలాయింపు రిజిస్ట్రేషన్ జరగలేదు. భూమిపై లిటిగేషన్ హక్కులకు రిజిస్ట్రేషన్ జరిగింది. భూమి విలువ ప్రకారం కాకుండా, ఎంతో కొంత ఫీజు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సబ్ రిజిస్ట్రార్ కేవలం రూ.8 లక్షలు తీసుకుని భూములు రిజిస్ట్రేషన్ చేశారు. ఇది కూడా బుక్ 1 (స్థిరాస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్)లో కాకుండా బుక్ 4 (చరాస్తి బదలాయింపు రిజిస్ర్టేషన్)లో చేశారు. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో మియాపూర్, మరియు 7 గ్రామాలు అని పేర్కొన్నారు తప్ప ఆ గ్రామాల పేర్లు రాయలేదు. ఎన్ని ఎకరాలో రాయలేదు. పైగా ఇవి కూడా ప్రభుత్వ భూములే కాబట్టి, ఈ రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు. ఇక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి నష్టం జరగలేదు. ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదు. విషయం తెలిసిన వెంటనే ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నది”

పై రెండు ప్రాంతాల్లోనే కాకుండా, మిగతా చోట్ల జరిగిన వ్యవహారంపై కూడా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జాగీరు భూములు రద్దయిప్పటికీ… ఇంకా వాటిపై హక్కులున్నాయని పత్రాలు సృష్టించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి కొందరు సబ్ రిజిస్ట్రార్లు సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదని, ఎంతటి వారినైనా శిక్షించి తీరుతుందని సిఎం స్పష్టం చేశారు. జాగీరు భూములు రద్దయ్యాయని, వాటిపై ప్రభుత్వానికే తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులుండవని సిఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైన న్యాయపోరాటం కూడా చేస్తామని వెల్లడించారు. ఒక్క గజం ప్రభుత్వ స్థలం కూడా పోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని సిఎం చెప్పారు.

రిజిస్ట్రేషన్లు జరిగే విధానంలోనే లోపముందని, ఈ వ్యవహారంలో ప్రక్షాళన జరగాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మియాపూర్, తదితర ప్రాంతాల్లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగు చూడకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఒక అవకాశంగా తీసుకుని రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అధికారులను ఆదేశించారు.

జాగీర్ భూములపై హక్కు పత్రాలు సృష్టించుకుని ప్రభుత్వ భూములను కాజేయాలని చూసే ప్రయత్నాలను అన్ని కోణాల నుంచి ఎదుర్కోవాలని సిఎం కేసీఆర్ చెప్పారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసులు నడుస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టుకు పూర్తి వివరాలు అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే నేరుగా వివరాలు పంపి, కేసు విచారణ సందర్భంగా పూర్వాపరాలను పరిగణలోకి తీసుకునే విధంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డిజిపి అనురాగ్ శర్మ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ కమిషనర్ నదీమ్ అహ్మద్, ఎసిబి డిజి పూర్ణచందర్ రావు, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ సుల్తానియా, సిఎంఓ కార్యదర్శులు శాంతకుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.