ప్రభుత్వ ఆస్తిగా విలువైన భూమి

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ పక్కనే సుమారు 20 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ గజం లక్ష పైమాటే. ఆ లెక్కన ఈ భూమి విలువ సుమారు వెయ్యి కోట్లు! ఇంత విలువైన ప్రభుత్వ భూమి దశాబ్దాలుగా వివాదాల్లో చిక్కుకుపోయింది. ఇప్పుడీ భూమి ప్రభుత్వానికి దక్కేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తుల కంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి భావించారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు నడుమ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు.

నిజానికిది 50 ఏండ్లుగా నలుగుతున్న వ్యవహారం. ఈ భూమిపై, ఇందులో వెలిసిన హౌసింగ్ సొసైటీలపై ఏండ్ల తరబడి న్యాయ వివాదాలు ఉన్నాయి. అనేక ఫోర్జరీ డాక్యుమెంట్లు, భూ కేటాయింపులు, అసైన్‌ మెంట్లు, కొనుగోళ్లు, అమ్మకాలు, వాటిపై కేసులు.. ఆ కేసుల మీద కేసులు.. వాటి మీద వాదనలు, ప్రతివాదనలు.. అప్పీళ్లు, ఉపసంహరణలు. కోర్టు తీర్పులు, సూచనలు.. ఇలా భూమి చుట్టూ సవాలక్ష ఆంక్షలు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా లాబీయింగ్, అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యం కారణంగా.. నగరం నడిబొడ్డున విలువైన భూమి వృథాగా ఉండిపోయింది.

కొందరు వ్యక్తులు ఆ భూములను తమకు నిజాం ప్రభుత్వం అసైన్ చేసిందని చెప్పుకున్నారు. అయితే వాటిలో ఫోర్జరీ డాక్యుమెంట్లే ఎక్కువగా ఉన్నాయి. బంజారాహిల్స్ లో సర్వే నం.129/34/1లోని భూములు తమకు నిజాం గవర్నమెంట్ అసైన్ చేసిందంటూ మీర్ ఇక్బాల్ అలీఖాన్ అనే వ్యక్తి పది ఎకరాలను డాక్యుమెంట్ నం. 249/1966లో ఎ.రఘునాథ్ అనే వ్యక్తికి రిజిస్టర్ చేశాడు. అతడు దాన్ని 1982లో గోదావరి సొసైటీకి అన్‌ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా విక్రయించారు. మరోవైపు అది తనకు సర్ఫేఖాస్ అథారిటీ నుంచి సంక్రమించిన ఆస్తి అంటూ మహ్మద్ ఖాసీం అలీ అనే వ్యక్తి.. ఎం వెంకట్‌ రెడ్డి, పుఖ్‌రాజ్‌ జైన్‌లకు డాక్యుమెంట్ నం.2638/1967 ప్రకారం సర్వే నం. 129/90లో పది ఎకరాలను విక్రయించారు. వాటిని కొనుకున్న ఆ ఇద్దరు వ్యక్తులూ రాధిక కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, నిజాం అసైన్ చేసినట్లుగా వాళ్లు చూపించిన పత్రాలు నకిలీవని తేలింది. ఆ సమయంలో అసైన్డ్ భూముల లెక్క తేల్చేందుకు నియమించిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఒక గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అసైన్‌మెంట్ డాక్యుమెంట్లు ఉన్న వారంతా ముందుకొచ్చి పత్రాలను చూపాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారిలో 20 మంది తమ దగ్గరున్న పత్రాలను చూపించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే.. అందులో 16 డాక్యుమెంట్లు ఫోర్జరీ అని తేలింది.

డాక్యుమెంట్లు నకిలీవని తేలడంతో అప్పటి ప్రభుత్వం జీవో 942ను విడుదల చేసింది. ఆ జీవోను గోదావరి, రాధిక హౌజింగ్ సొసైటీలు కోర్టులో సవాలు చేశాయి. ఐదేండ్ల తర్వాత జీవోను పక్కన పెడుతూ సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దానిపై అప్పటి ప్రభుత్వం అప్పీలుకు వెళ్లినా.. త్రిసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ కేసులో 1989 నుంచి 1998 వరకు వాదోపవాదాలు సాగాయి. అప్పటికే చాలా ఏళ్లు గడిచిపోయినందున.. ప్లాట్ల కొన్నవారికి వీలుంటే రెగ్యులరైజేషన్‌ చేసి ఇవ్వాలని కోర్టు నాటి ప్రభుత్వానికి సూచించింది. కోర్టు చెప్పినట్టు భూములను క్రమబద్ధీకరణ చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్, రోశయ్య తీవ్ర జాప్యం చేశారు. నాలుగు క్యాబినెట్ సబ్ కమిటీలు వేసినా.. అవి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం రాకుండా నాటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. అలా మరో 16 ఏండ్లు కాలగర్భంలో కలిసిపోయాయి.

కొందరు ఆంధ్ర ప్రాంత పారిశ్రామికవేత్తలు కూడా ఈ సొసైటీల్లో ప్లాట్లు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ముగ్గురు ముఖ్యమంత్రులూ దీనిపై నిర్ణయం తీసుకోలేకపోయారనే అభిప్రాయం కూడా ఉంది. ఒకవైపు కేసులు నడుస్తుండగానే.. రెండు సొసైటీలు ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూముల చెర విడిపించాలని నిర్ణయించింది. అవి ఫేక్ డాక్యుమెంట్లని తేలడంతో.. ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలన్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బంజారాహిల్స్‌లో ఖరీదైన 20 ఎకరాలను చేజార్చుకోవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భూముల రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అదిప్పుడు ప్రభుత్వ ఆస్తిగా మారిపోయింది.