ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులు భారత్, అమెరికా

నేటి ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులు అమెరికా, భారత్‌ మాత్రమేనని ప్రధాని మోడీ అన్నారు. తాను, ట్రంప్‌ అభివృద్ధి యంత్రాలమని వ్యాఖ్యానించారు. తన పర్యటన ద్వారా అమెరికాతో భారత్‌ బంధం మరింత బలపడిందన్నారు. అమెరికా అధినేత ట్రంప్‌, ఆ దేశ అధికార బృందంతో వైట్‌హౌస్‌లో వివిధ స్థాయుల సమావేశం తర్వాత అక్కడి రోజ్ గార్డెన్‌లో ట్రంప్, మోడీ సంయుక్త ప్రకటన చేశారు. ఈ సమావేశంలో భారత్, అమెరికా మధ్య మరింత బలమైన సంబంధాల దిశగా విస్తృతమైన చర్చలు జరిగాయన్నారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు ప్రధానాంశాలు కాగా, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, ఆర్ధిక అంశాలు కూడా కీలకంగా ఉన్నాయన్నారు. ఈ క్రమంలో తీరప్రాంత వాణిజ్యంపైనా దృష్టి సారించామన్నారు. ఇక ఉగ్రవాదం విసురుతున్న సవాళ్ళపై తమ సంయుక్త పోరాటం ముఖ్యమైన అంశంగా ఉంటుందన్నారు ప్రధాని మోడీ. తమ చర్చల్లో భాగంగా ప్రాంతీయ సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, ఆప్ఘనిస్థాన్ ఎదుర్కుంటున్న సమస్యలను ఉమ్మడి అంశంగా పరిగణిస్తామని చెప్పారు. భారత్ – అమెరికా సంబంధాల్లో భద్రత, రక్షణ సంబంధిత అంశాలు కీలకమైనవంటూ వీటిపై విస్తృతంగా చర్చించామన్నారు. అధ్యక్షుడు ట్రంప్ విజన్ అయిన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’… తన విజన్ అయిన ‘న్యూ ఇండియా’ ఒక సమాహారంగా ఉంటాయని మోడీ తెలిపారు.  పరస్పర విశ్వాసం ఆధారంగా సాగిన నేటి తమ చర్చలు అత్యంత ముఖ్యమైనవన్నారు. చివరిగా ట్రంప్ కుటుంబాన్ని భారత పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు. ట్రంప్ కుమార్తె ఇవాంకాను భారత్‌లో ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ సదస్సులో పాల్గొనేందుకు రావాలని కోరారు.