జీఎస్టీతో ప్రజోపయోగ పథకాల స్ఫూర్తిని నీరు గార్చొద్దు

ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 17వ సమావేశంలో రాష్ట్రం తరఫున ఆరు అంశాలను కౌన్సిల్‌ ముందుంచామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులపై జీఎస్టీ రూపంలో భారీ భారం పడనుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

రూ. 40 వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథపై రూ. 2 వేల కోట్ల జీఎస్టీ భారం పడనుందని, రూ. 18 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్‌ పథకంపై రూ. 800 కోట్ల భారం పడనుందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన పథకాలు చేపడుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రూ. 8 వేల కోట్ల భారం పడనుందని వెల్లడించారు. ఈ పథకాలన్నీ దేశమంతటినీ ఆకర్షిస్తున్నాయని, ప్రజోపయోగ పథకాలపై భారం వేస్తే వాటి స్ఫూర్తి నీరుగారుతుందన్నారు.

గ్రానైట్‌, వస్త్ర పరిశ్రమ, బీడీ పరిశ్రమపై పడనున్న భారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ జీఎస్‌టీలో సవరణలు కల్పించాలని కోరామన్నారు. గ్రానైట్‌పై జీఎస్‌టీ 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని కోరామని వెల్లడించారు. బీడీ పరిశ్రమపై పడే భారంతో దాదాపు 2 లక్షల మంది బీడీ కార్మికులపై ప్రభావం పడుతుందన్నారు.

ఈ సమావేశంలో అరుణ్‌జైట్లీకి అన్ని అంశాలపై వివరించామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సవివరమైన నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారని, నాలుగైదు రోజుల్లో ఆర్థికశాఖ మంత్రి, కార్యదర్శికి నివేదిక అందిస్తామన్నారు.